వచ్చే ఎన్నికల్లో పటిష్టమైన ఓట్ల బ్యాంకు ఏర్పాటులో చంద్రబాబునాయుడు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ నే అంటిపెట్టుకుని ఉన్న ఎస్సీ, మైనారిటీల ఓటు బ్యాంకుపై చంద్రబాబు గురిపెట్టారు. దానికితోడు టిడిపినే మొదటి నుండి ఆదిరిస్తున్న బిసి ఓటు బ్యాంకును మరింత పటిష్టం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో పటిష్టమైన ఓట్ల బ్యాంకు ఏర్పాటులో చంద్రబాబునాయుడు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ నే అంటిపెట్టుకుని ఉన్న ఎస్సీ, మైనారిటీల ఓటు బ్యాంకుపై చంద్రబాబు గురిపెట్టారు. దానికితోడు టిడిపినే మొదటి నుండి ఆదిరిస్తున్న బిసి ఓటు బ్యాంకును మరింత పటిష్టం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇంతకీ చంద్రబాబు ఏం చేస్తున్నారు? రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అనేక సంక్షేమ పథకాలకు రూపకల్పన చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని పథకాలను పై వర్గాలను దృష్టిలో పెట్టుకునే అమల్లోకి తెచ్చారు.
ఇక, రాబోయేదంతా ఎన్నికల కాలమే కాబట్టి ఏడాదిన్నర కాలంలో ఎన్ని వీలైతే అన్ని పథకాలూ పై వర్గాల కోసమే అమలు చేయాలన్నది చంద్రబాబు ఆలోచన. ఎందుకంటే, మొత్తం జనాభాలో పై వర్గాలే తక్కువలో తక్కువ 60 శాతముంటారు. ఎస్సీ, మైనారిటీలు ఇప్పటి వరకూ కాంగ్రెస్ తోనే ఉండేవారన్న విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్ర విభజన ప్రభావంతో పై వర్గాలు పోయిన ఎన్నికల్లో వైసీపీని ఆధిరంచాయి. మొన్నటి నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో టిడిపి సాధించిన ఘన విజయంలో ఎస్సీ, మైనారిటీల మద్దతు కూడా తక్కువేమీ కాదు. ప్రత్యేకించి నంద్యాలలో మెజారిటీ ముస్లింలు, కాకినాడలో ఎస్సీలు టిడిపికి అండగా నిలవటం అందరినీ ఆశ్చర్యపరిచింది.
దాంతో చంద్రబాబులో కూడా ఆలోచన మొదలైంది. పై రెండు వర్గాలను గనుక మరింత దగ్గరకు తీసుకుంటే బిసిల మద్దతుతో టిడిపికి తిరుగులేని ఓటు బ్యాంకు ఏర్పాటవుతుందని ఆలోచించారు. పై వర్గాలకు దగ్గరవ్వాలంటే ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు అమలు చేయటమొకటే మార్గంగా నిర్ణయించారు. అదే విషయాన్ని పార్టీ నేతలతో జరిగిన టెలికాన్ఫరెన్స్ లో కూడా చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. పనిలోపనిగా క్రిస్తియన్ మైనారిటీలను కూడా దగ్గరకు తీసుకునేందుకు ఓ పథకం ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద చంద్రబాబు వైసీపీని దెబ్బకొట్టేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారనటంలో సందేహమే లేదు.
