ప్రస్తుత రాజకీయ వాతావరణంలో జెపి తరచూ చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడుతున్నారు.
లోక్ సత్తా వ్యవస్ధాపక అధ్యక్షుడు, పవన్ కల్యాణ్ కు సన్నిహితుడైన జయప్రకాశ్ నారాయణ త్వరలో రాజ్యసభకు వెళ్ళనున్నారా? అదికూడా టిడిపి నుండట. టిడిపి వర్గాలు చెబుతున్నదాని ప్రకారం, మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇంతకీ విషయం ఏమిటంటే, వచ్చే నెలలో రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్ధానాలకు ఎన్నికలు జరుగుతుంది. ప్రస్తుత ఎంఎల్ఏల బలాల ప్రకారం మూడింటిలో రెండు స్ధానాలు టిడిపికి ఒకస్ధానం వైసిపికి దక్కుతుంది. టిడిపికి దక్కనున్న రెండు స్ధానాల్లో ఒకటి జయప్రకాశ్ నారాయణ (జెపి)కు కేటాయించాలని చంద్రబాబునాయుడు నిర్ణయించారట. మాజీ ఐఏఎస్ అధికారి కూడా అయిన జెపి మేధావి అనటంలో సందేహం అవసరంలేదు.
కాబట్టి జెపిని టిడిపి తరపున పార్లమెంటుకు పంపితే పార్టీకి బాగా ఉపయోగమని చంద్రబాబు నిర్ణయించారట. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో జెపి తరచూ చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడుతున్నారు. మొన్నటి వరకూ చంద్రబాబును జెపి తప్పుపట్టేవారు. హటాత్తుగా జెపి వాయిస్ లో ఎందుకు తేడా వచ్చిందో మొదట్లో ఎవరికీ అర్దం కాలేదు.
అయితే, రాజ్యసభ ఎన్నికల వాతావరణం మొదలైన తర్వాత వెలుగు చూసిన విషయంతో జెపికి టిడిపి రాజ్యసభ సభ్యత్వం నిజమే అని అనుకుంటున్నారు. సరే, ఇక రెండో స్ధానాన్ని తెలంగాణా టిడిపికి ఇవ్వాలని అనుకుంటున్నారట.
అసలు టిడిపి తరపున మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభకు పంపాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చంద్రబాబును కోరారట. అయితే చంద్రబాబు అందుకు ఒప్పుకోలేదట. వైసిపికి దక్కుతుందని అనుకుంటున్న మూడో స్ధానంపై చంద్రబాబు కన్నేసారట. ప్రస్తుత బలాబలాల ప్రకారమైతే ఒక రాజ్యసభ స్ధానానికి 44 మంది ఎంఎల్ఏల ఓట్లు అవసరం.
టిడిపి శిబిరంలో రెండు స్ధానాలకు ఓట్లు వేసిన తర్వాత ఇంకా 15 ఓట్లు మిగిలిపోతాయి. ఫిరాయింపులు, బిజెపి, స్వతంత్ర ఎంఎల్ఏలను కలుపుకుంటే సుమారుగా 42 మంది ఎంఎల్ఏలుంటారు. అంటే ఇంకో రెండు ఓట్లను గనుక సంపాదించుకోగలిగితే మూడో స్దానం కూడా టిడిపి ఎగరేసుకుపోవచ్చు. అందుకే వైసిపికి చిల్లు పెట్టాలన్నది చంద్రబాబు వ్యూహం. మరి చంద్రబాబు ఏ మేరకు సక్సెస్ అవుతారు? ఒకవేళ సక్సెస్ అయితే ఆ మూడో స్దానాన్ని ఎవరికి కేటాయిస్తారన్నది సస్పెన్స్.
