నాడు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదని మండిపడుతున్నారు.

తెలుగుభాషకు సంబంధించి ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీనే చంద్రబాబునాయుడు తూట్లు పొడుస్తున్నారు. ఇచ్చిన హామీని నిలుపుకునే ఉద్దేశ్యం లేనట్లే వ్యవహరిస్తున్నారు. తెలుగును రెండవ జాతీయ భాషగా గుర్తించాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెస్తానంటూ 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చారు. గడచిన రెండేళ్ళ లో చంద్రబాబు ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లారో లెక్కేలేదు. అయితే, ఒక్కసారి కూడా తెలుగుభాషపై కేంద్రంతో మాట్లాడినట్లు కనబడలేదు. పైగా రాష్ట్రంలోని 4 వేల పురపాలక సంఘ స్కూళ్ళను ఇంగ్లీషు భాషలోకి మార్చేయాలని ఉత్తర్వులివ్వటం విచిత్రం.

అంతర్జాతీయ భాషా దినోత్సవం సందర్భంగా పోయిన ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలపై భాషా ప్ర్రేమికులు మండిపడుతున్నారు. నాడు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదని మండిపడుతున్నారు. పైగా చంద్రబాబు వైఖరి తెలుగు భాషకు తెగులు పట్టించే విధంగా తయారైందంటూ ధ్వజమెత్తుతున్నారు. రాజకీయ హామీల్లాగ కాకుండా భాషా వ్యాప్తికి ఇచ్చిన హామీలను నిలుపుకోకపోతే భవిష్యత్తరాలు ఇబ్బందులు పడతాయంటూ చంద్రబాబుపై భాషా శాస్త్రవేత్తలు, నిపుణులు స్పష్టం చేస్తున్నారు.