Asianet News TeluguAsianet News Telugu

వైసీపీ ఎంఎల్ఏలు కోతులా ?

చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే ప్రతిపక్షాన్ని ప్రతిపక్షంలాగ కాకుండా శత్రుపక్షంలాగ చూస్తున్నట్లుంది.

Naidu says ycp MLAs are monkeys

వైసీపీ ఎంఎల్ఏలను కోతులతో పోల్చారు చంద్రబాబునాయుడు. అసెంబ్లీలో బల్లలు ఎక్కి దూకుతున్నారట. మైకులు విరగ్గొడుతున్నారట. వాళ్ళ అరుపులు వినబడకుండా చెవుల్లో దూది పెట్టుకున్నా భరించలేని విధంగా ఉంటోందట. ఇక ‘మంచి నేతలు దొరికితే వచ్చే ఎన్నికల్లో 175 సీట్లూ మనవే’ అంటున్నారు. చంద్రబాబు చెప్పేదెలాగుందంటే, ‘ఫలానా వస్తువు కొంటే విదేశీయానానికి టిక్కెట్లు ఫ్రీ..షరతులు వర్తిస్తాయి’ అన్నట్లుంది. కాంగ్రెస్ పార్టీకి ఎంఎల్సీ చెంగల్రాయడు టిడిపిలో చేరారు. అనంతరం తెలంగాణా నేతలతో భేటీ సందర్భంగా చంద్రబాబు వైసీపీపై ధ్వజమెత్తారు.

 

చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే ప్రతిపక్షాన్ని ప్రతిపక్షంలాగ కాకుండా శత్రుపక్షంలాగ చూస్తున్నట్లుంది. అందుకనే అంతేసి వ్యాఖ్యలు చేస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నపుడు టిడిపి ఎంఎల్ఏలు  ఎలా ప్రవర్తించారో మరచిపోయినట్లున్నారు చంద్రబాబు. గవర్నర్ ప్రసంగాన్ని ఎన్నోసార్లు అడ్డుకున్నారు. వైఎస్ హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై చేసిన గందరగోళాన్ని ఎవరూ మరచిపోలేరు. అదేవిధంగా ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి సంబంధించి గాలి జనార్ధనరెడ్డి వ్యవహారాలపై ఎంతో గోల చేసారు. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కూడా చేసిన గందరగోళం అంతా ఇంతా కాదు. మైకులు లాగేసిన సందర్భాలూ చాలానే ఉన్నాయి.

 

తాజాగా ఇపుడు కూడా వైసీపీ శాసనసభ్యులను అమ్మనాబూతులు తిడుతూనే ఉన్నారు. బోండా ఉమ, అచ్చెన్నాయడు, బుచ్చయ్యచౌదరి తదితరులు వైసీపీ ఎంఎల్ఏలపై చేసిన వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల్లో చూస్తే తెలుస్తుంది. వైసీపీ సభ్యులను టిడిపి సభ్యులు ఏ విధంగా రెచ్చగొడుతున్నారో ప్రొసీడింగ్స్ చూస్తే ఎవరికైనా అర్ధం అవుతుంది. అసెంబ్లీలో గొడవ ఒక్క వైసీపీ సభ్యులే కాదు టిడిపి సభ్యులూ చేస్తున్నారు. కాకపోతే అధికారపార్టీ సభ్యుల వ్యాఖ్యలు, గొడవ రికార్డులకు ఎక్కటం లేదంతే. ఇక, మంచినేతలు దొరికితే వచ్చే ఎన్నికల్లో 175 సీట్లూ టిడిపివేనట. చంద్రబాబు ఉద్దేశ్యంలో ‘మంచి’ అంటే ఏమిటో? బోండా ఉమా, అచ్చెన్నాయడు, బోడె ప్రసాద్, చింతమనేని ప్రభాకర్ లాంటి వాళ్లేమో.

Follow Us:
Download App:
  • android
  • ios