‘ప్రతిపక్ష వైసీపీ ఇబ్బందుల్లో ఉంది, ఆ పార్టీ వల్ల నష్టం లేదు’ ఇది చంద్రబాబునాయుడు చేసిన తాజా వ్యాఖ్యలు. ఈరోజు క్యాంపు కార్యాలయంలో మంత్రులు, నేతలతో జరిగిన సమన్వయ కమిటి సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, సిట్టింగ్ అభ్యర్ధి చనిపోతే ఆ కుటంబంలో ఒకరిని ఏకగ్రీవం చేసే సంప్రదాయాన్ని వైసీపీ తుంగలో తొక్కిందని విమర్శించారు. ఇక్కడే అందరికీ ఓ అనుమానం వస్తోంది.

అవేంటంటే, సిట్టింగ్ ఎంఎల్ఏ చనిపోతే కుటుంబంలో ఎవరినో ఒకరిని ఏకగ్రీవం చేసే సంప్రదాయానికి జగన్ తూట్టు పొడిచారట. భూమా నాగిరెడ్డి మృతిచెందేనాటికి టిడిపిలో ఉన్నమాట వాస్తవమే. అయితే, ఆయన ఏపార్టీ గుర్తుమీద గెలిచారు? ఎన్నికల కమీషన్ వెబ్ సైట్లో గానీ, అసెంబ్లీ రికార్డుల్లో గానీ భూమా నాగిరెడ్డి వైసీపీ సభ్యుడే కదా? కాదని చంద్రబాబు అనగలరా? అంతెందుకు, వైసీపీ నుండి ఫిరాయించిన ఎంఎల్ఏలు, ఎంఎల్సీల్లో ఎవరైనా సరే తాము టిడిపి తరపునే పోటీ చేసి గెలిచామని చెప్పగలరా?

ఒక పార్టీ తరపున గెలిచి ఇంకోపార్టీలోకి ఫిరాయించటమన్నది వారి వ్యక్తిగతం. అటువంటి వారి విషయంలో చట్టాలు వెంటనే చర్యలు తీసుకోలేకపోవటమే దురదృష్టం. అటువంటి లొసుగలనే కదా చంద్రబాబు అడ్డుపెట్టుకుని నాటకాలాడుతున్నది. సాంకేతికంగా భూమా నాగిరెడ్డి వైసీపీ సభ్యుడే కాబట్టి నంద్యాల సీటు కూడా వైసీపీదే. మరిక్కడ తూట్లు పొడిచింది ఎవరు?

రెండో అంశం వైసీపీ ఇబ్బందుల్లో ఉందట. వైసీపీ ఇబ్బందుల్లో ఉన్నపుడు అసలు ఆ పార్టీని లెక్క చేయాల్సిన అవసరం ఏంటి? మంత్రులు, నేతలతో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో కూడా వైసీపీ గురించి, జగన్ గురించే చంద్రబాబు మాట్లాడుతున్నారంటేనే ఇబ్బందుల్లో ఎవరున్నారో స్పష్టమవుతోంది.

అయినా వైసీపీ ఇబ్బందుల్లో ఉందని చెప్పిన చంద్రబాబు ఆ ఇబ్బందులేమిటో మాత్రం చెప్పలేదు. అయితే, సమస్య అంతా టిడిపి నేతల వల్లే వస్తోందన్న వాస్తవాన్ని కూడా చంద్రబాబు ఒప్పుకున్నారు. చంద్రబాబు ఇచ్చిన లైసెన్సుల వల్లే నేతలు రెచ్చిపోయి పార్టీ, ప్రభుత్వ పరువును బజారుకీడుస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ఆ విషయాన్ని గమనించినందుకు సంతోషం. మిగిలిన రెండేళ్ళలో పరిస్ధితిని చక్కదిద్దుకోకపోతే అంతే సంగతులు.