మరోసారి విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు జరగటానికి రంగం సిద్దమవుతోంది. వచ్చే ఫిబ్రవరి 23, 24, 25 తేదీల్లో అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు జరుగుతుందని చంద్రబాబునాయుడు స్వయంగా చెప్పటం గమనార్హం. ఈసారి జరగబోయే సదస్సులో మరింత భారీ స్ధాయిలో పెట్టుబడులు వస్తాయని చంద్రబాబు చెప్పటం విచిత్రంగా ఉంది. ఎందుకంటే, ఇప్పటి వరకూ మూడుసార్లు పెట్టుబడుల సదస్సు జరిగింది. ఏ మేరకు పెట్టుబడులు వచ్చాయంటే ప్రభుత్వం నుండి సరైన సమాధానం రాదు.

ప్రతీసారి పెట్టుబడుల సదస్సు జరిగినప్పుడల్లా లక్షల కోట్లలో ఒప్పందాలు జరిగాయని మాత్రం చంద్రబాబు చెబుతుంటారు. కానీ వాస్తవంగా వచ్చింది పెద్దగా లేదు. అంటే రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులంతా కేవలం చంద్రబాబు మాటల్లోను, కాగితాల్లో మాత్రమే కనబడుతోంది. పోయిన సారి సదస్సు జరిగిన తర్వాత దేశ, విదేశాలకు చెందిన సంస్ధలు రూ. 12 లక్షల కోట్లు పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నట్లు సిఎం ప్రకటించారు. కానీ వచ్చిందెంత అన్నది సస్సెన్స్.

రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల విషయమై మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అడిగితే ఏమీ రాలేదనే సమాధానం వచ్చింది. సమాచార హక్కు చట్టం ద్వారా పరిశ్రమల శాఖను సంప్రదించగా పెట్టుబడులు ఏవీ రాలేదని, సంప్రదింపుల దశలోనే ఉన్నాయని పరిశ్రమల శాఖ స్పష్టంగా సమాధానమిచ్చింది. అంటే దీన్ని బట్టి ఏమర్ధమవుతోంది? సదస్సు నిర్వహణకు అవుతున్న ఖర్చు మందం కూడా పెట్టుబడులు రావటం లేదని తేలిపోయింది. మళ్ళీ నాలుగోసారి పెట్టుబడుల సదస్సట. ఈసారి కూడా పెట్టుబడులేవో వచ్చేస్తాయన్న భ్రమలు ఎవరికీ లేవు.  కాకపోతే లక్షల కోట్లలో పెట్టుబడులు వచ్చేస్తున్నాయని చంద్రబాబు ఆర్భాటపు ప్రకటలు చేయటం మినహా ఎటువంటి ఉపయోగం ఉండదు.