‘హక్కుల సాధన కోసం రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉంది’..ఇవి తాజాగా చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు. ఏపి హక్కుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని మండిపడ్డారు. కాబట్టే కేంద్రంపై పోరాటానికి రాజకీయ పార్టీలన్నీ ఏకం కావాలట.

ఇన్ని సంవత్సరాలపాటు వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రతిపక్షాలన్నీ అఖిలపక్ష సమావేశాలు నిర్వహించమంటే కుదరదన్నారు. హక్కుల సాధన కోసం రాజకీయ పార్టీలను ఢిల్లీకి తీసుకెళ్ళమంటే అవసరం లేదన్నారు. ప్రత్యేకహోదా కోసం ఆందోళనలు చేసిన వాళ్ళపై పోలీసులు కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు. ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజిపై పదిసార్లు పిల్లిమొగ్గలేశారు.

అటువంటి చంద్రబాబు ఇపుడు హక్కుల సాధనకు రాజకీయ పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపివ్వటమే ఆశ్చర్యంగా ఉంది. శాంతి, భద్రతలకు సమస్యలు రాకుండా ఎవరు ఎటువంటి ఆందోళనలు చేసినా ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పటమే విచిత్రంగా ఉంది. గతంలో కూడా ఆందోళనలు శాంతియుతంగానే జరిగాయి. మరి అప్పుడు కేసులెందుకు పెట్టినట్లు?

అంటే, వచ్చే ఎన్నికల్లో తనపై జనాలు ఎక్కడ తిరగబడతారో, ఎక్కడ టిడిపికి వ్యతిరేకంగా  ఓట్లు వేస్తారో అన్నభయం చంద్రబాబులో స్పష్టంగా కనబడుతోంది. అందుకే ప్రత్యేకహోదా కోసం మొదటి నుండి తానే పోరాటాలు చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. చంద్రబాబు పిలుపుకు జనాలు ఏమాత్రం సానుకూలంగా స్పందిస్తారో చూడాల్సిందే.