రాష్ట్రంలోని రాజకీయ నేతల్లో అత్యంత ప్రజాధరణ కలిగిన నేతలు ఎన్టీఆర్, వైఎస్ఆర్ అని జనాలు చెప్పిన విషయాన్ని చంద్రబాబు మరచిపోయారేమో. అంతెందుకు టిడిపిని ఒంటరిగా ఎన్నికల్లో గెలిపించిన చరిత్ర చంద్రబాబుకు ఒక్కసారనైనా ఉందా? ఎప్పుడు గెలిచినా ఎవరోకరు ఊతమివ్వాల్సిందే కదా? స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎవరికీ దక్కని గౌరవం తనకే దక్కిందంటే ఎవరు నమ్ముతారు?
‘స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలు నాకు ఇచ్చిన గౌరవం మరెవ్వరికీ ఇవ్వలేదు’ రెండు రోజుల కుప్పం పర్యటనలో చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలివి. ‘విభజిత రాష్ట్రాన్ని కాపాడుతానని నమ్మే ప్రజలు నన్ను గెలిపించారు’ అని కూడా అన్నారు. నిజమే, విభజన తర్వాత విభజిత ఏపి అన్నీ రకాలుగా ఇబ్బందుల్లో ఉందని జనాలు అనుకున్న మాట వాస్తవమే. అలా అనుకునే చంద్రబాబును గెలిపించారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు చేసిందేమిటి?
ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలే. టిడిపి నేతలు యధేచ్చగా దోచుకునేందుకు లైసెన్సులు ఇచ్చేసారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇసుక అక్రమ తవ్వకాలు, ఎర్రచందనం స్మగ్లింగ్, తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం నిర్మాణాలు..ఇలా ఎక్కడ చూసినా కోట్లాది రూపాయల దోపిడీనే. రాజధాని చుట్టుపక్కల భూములన్నీ టిడిపి నేతలు కొనుగోలు చేసిన తర్వాతనే రాజధాని ప్రకటించారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అందరూ వింటున్నవే కదా?
చివరకు ప్రభుత్వ పథకాల్లో లబ్దిదారుల ఎంపిక కూడా జన్మభూమి కమిటీల ద్వారానే ఎంపిక చేస్తున్నారు. సంక్షేమపథకాల్లో లబ్దిదారులు కావాలంటే టిడిపి సభ్యత్వం ఉండాలట. విచిత్రమైన నిబంధనను అమలు చేస్తున్నారు టిడిపి నేతలు. ఈ విషయమై రాష్ట్రంలో చాలా చోట్లే గొడవలవుతున్నాయి కదా? జరుగుతున్నదంతా చూస్తుంటే, ప్రజలు ఒకందుకు గెలిపిస్తే చంద్రబాబు పాలన ఇంకోలా సాగుతోందని అందరికీ అర్ధమైపోయింది.
తనకే ప్రజలు అత్యంత గౌరవం ఇస్తున్నారని చంద్రబాబు చెప్పుకోవటంలో అర్ధం లేదు. ఎందుకంటే, రాష్ట్రంలోని రాజకీయ నేతల్లో అత్యంత ప్రజాధరణ కలిగిన నేతలు ఎన్టీఆర్, వైఎస్ఆర్ అని జనాలు చెప్పిన విషయాన్ని చంద్రబాబు మరచిపోయారేమో. అంతెందుకు టిడిపిని ఒంటరిగా ఎన్నికల్లో గెలిపించిన చరిత్ర చంద్రబాబుకు ఒక్కసారనైనా ఉందా? ఎప్పుడు గెలిచినా ఎవరోకరు ఊతమివ్వాల్సిందే కదా?
1995లో మొదటిసారి ముఖ్యమంత్రి ఎలా అయ్యారో అందరికీ తెలిసిందే. 1999లో భాజపా మద్దతుతో గెలిచారు. 2003లో మాత్రమే టిడిపి ఒంటరిగా పోటీ చేసింది. ఓడిపోయింది. చివరకు 2009లో మహాకూటమి పేరుతో టిఆర్ఎస్, వామపక్షాలతో జట్టుకట్టినా ఓడిపోయారు కదా? మళ్ళీ 2014లో భాజపా, జనసేన మద్దతుతోనే కదా అధికారంలోకి వచ్చింది? ఇక, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎవరికీ దక్కని గౌరవం తనకే దక్కిందంటే ఎవరు నమ్ముతారు?
