2019 లో గెలుపే ముఖ్యం. పార్టీ బాగు కోసం ఎలాంటి నిర్ణయం తీసుకునేందుకైనా వెనుకాడను
ఫిరాయింపులదారులను క్యాబినెట్ లోకి తీసుకున్నారని అలిగిన తమ్ముళ్లందరికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెగేసి ఒకటే మాట చెప్పాడు. నాయిష్టం. పార్టీని 2019లో గెలిపించేందుకు ఏ నిర్ణయం తీసుకునేందుకయినా వెనకాడను, అని.
పార్టీని నమ్ముకున్నతమని కాదని ఈ మధ్యనే వైసిసి నుంచి ఫిరాయించిన వారు నాయకత్వం మీద విమర్శలు గుప్పిస్తున్న సమయంలో ఆయన ఎమ్మెల్యేలతో , ఎంపిలతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.
ఏదైనా ఉంటే తనతో నేరుగా చెప్పాలని పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు సూచించారు. ఆదివారం కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
‘పార్టీ బాగు కోసం ఎలాంటి నిర్ణయం తీసుకునేందుకైనా వెనుకాడను. ప్రజలు బాగుండాలంటే పార్టీ కూడా బాగుండాలన్న విషయాన్ని అర్థం చేసుకోండి,’ అని పార్టీ నేతలకు చంద్రబాబు హెచ్చరిక చేశారు.
‘నిన్న కొందరు శృతి మించి ప్రవర్తించారు. వారి తీరు బాధ కలిగించిందనరని. ఎవరికైనా అసంతృప్తి ఉంటే నాతో డైరెక్ట్ గా చెప్పాలి., ఈ విధంగా వ్యవహరించటం సరికాదు,’ అని కొంచెం కటువుగా మాట్లాడారు.
‘2019 ఎన్నికల్లో గెలవటమే పార్టీ లక్ష్యం. ఇరవైఆరు మందికి మించి మంత్రివర్గంలో చోటు కల్పించేందుకు వీలు కాదు. దానికితోడు అన్ని ప్రాంతాలు, వర్గాలకు ప్రాధాన్యం కల్పించాలి. కొందరికి అర్హత ఉన్నా.. నింబధనలకు విరుద్ధంగా చేయకూడదన్న ఉద్దేశంతో ఇవ్వలేకపోయాం. ఇవన్నీ తెలిసీ క్రమశిక్షణ తప్పేలా వ్యవహరించటం ఎంత వరకు సబబు? పార్టీ ప్రయోజనాలకంటే వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటే సహించను,‘ అని హెచ్చరిక చేశారు.
