చంద్రబాబునాయుడులో అందరూ సీరియస్ కోణమే చూస్తారు కానీ అదిరిపోయే జోకులు కూడా వేయగలరన్న విషయం చాలామందికి తెలీదు. అయితే, ఆ జోకులను ఎప్పుడు పడితే అప్పుడు వేయరు. అందుకే అందరికీ చంద్రబాబులోని సీరియస్ కోణమే కనిపిస్తుంది.

ఇదంతా ఎందుకంటే, చంద్రన్న రాజకీయ జీవితానికి 40 ఏళ్ళయిందట. అందుకనే ఒక్కో మీడియాకు విడివిడిగా ఇంటర్వ్యూలిచ్చారు. సరే, ఇంటర్వ్యూలివ్వటం చంద్రబాబుకు కొత్తేమీ కాదులేండి. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వైఎస్ ఆర్ కు తానే కాంగ్రెస్ లో టిక్కెట్టు ఇప్పించినట్లు చెప్పారు.

చంద్రబాబు ఇంటర్య్వూ చూసిన వాళ్ళు, చంద్రబాబు మాటలు విన్నవారు ఒక్కసారిగా హాశ్చర్యపోయారు. తర్వాత పొట్టచెక్కలయ్యేలా నవ్వటం మొదలుపెట్టారు. చంద్రబాబేంటి వైఎస్ కు టిక్కెట్టు ఇప్పించటమేంటి? అంటూ ఒకటే నవ్వు.

ఎందుకంటే, చంద్రబాబు, వైఎస్ ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. చంద్రబాబు కాంగ్రెస్ తరపున చిత్తూరు జిల్లా చంద్రగిరిలో పోటీ చేశారు. వైఎస్ కడప జిల్లా పులివెందులలో రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన వాళ్ళల్లో గెలిచింది ఒక్క వైఎస్ మాత్రమే.

తర్వాత రెడ్డి కాంగ్రెస్ ను కాంగ్రెస్ లో విలీనం చేసేసారు. దాంతో వైఎస్ కూడా కాంగ్రెస్ ఎంఎల్ఏ అయ్యారు. 1983-1985 మధ్య వైఎస్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షునిగా పనిచేశారు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టటం, 1983లో అధికారంలోకి రావటం అందరికీ తెలిసిందే. 1983లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన చంద్రబాబు చంద్రగిరిలో ఓడిపోయి 1984లో టిడిపిలో చేరిపోయారు.

ఇదంతా చరిత్ర. వాస్తవం కూడా ఇదే. మరి వైఎస్ కు చంద్రబాబు టిక్కెట్టు ఇప్పించిందెపుడు? మొదటిసారి గెలిచిన చంద్రబాబు అప్పట్లోనే ఇంకోరికి టిక్కెట్టు ఇప్పించేంత సీన్ ఉందా? వైఎస్ కు తానే టిక్కెట్టింపించానని అంత ధైర్యంగా ఎలా చెప్పగలిగారు? భజన చేసే మీడియా ఉండగా ఏమి చెప్పినా చెల్లుబాటైపోతుందనే దైర్యమే చంద్రబాబుతో అలా చెప్పించిందేమో?