మరి విభజనకు ఒప్పుకుంటూ కేంద్రానికి రాసిన లేఖ సంగతి ఏమిటి?

2014 లో రాష్ట్ర విభజన చేసేటప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న నాకు ఒక్కమాట చెప్పలేదని, దానిని తాను మర్చిపోలేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జరిగిన ఈ అవమానాన్ని తాను అంత తేలిగ్గా మర్చిపోలేనని కూడా ఆయన అన్నారు.


(అదేమిటి, ఆయన రాష్ట్ర విభజనకు అంగీకారం తెలుపుతూ ఎపుడో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నపుడే లెటర్ ఇచ్చారు కదా అనకండి. ఆయన ఏమిచెప్పినా వినాలి. అంతే, ప్రశ్నిస్తే, అభివృద్ధినిరోధకులు అవుతారు. 2012 'సెప్టెంబర్ లోనే ఆయనప్రధాని మన్మోహన్ సింగ్ కు లేఖ రాశారు.దానికి నిరసనగానే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాజీనామా చేశారు.)


ఈ రోజు రాజధాని ప్రాంతంలో వెలగపూడి వద్ద నిర్మించిన కొత్త అసెంబ్లీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ చంద్రబాబు ఇలా మాట్లాడారు. 

రాష్ట్ర విభజన గురించి తనకు ఒక మాట కూడా చెప్పలేదని తెగబాధ పడ్డారు.


 ‘విభజన పట్ల ఇప్పటికీ నాకు తీవ్రమైన బాధ కలుగుతోంది. పోరాడినా ఫలితం లేక రాష్ట్ర ప్రజలు నీరసించిపోయారు. ప్రజల సెంటిమెంట్‌తో ఆడుకోవద్దని చెప్పినా, ఎవరూ వినలేదు. మన అవమానాన్ని సానుకూలంగా మార్చుకుందాం.. నా కష్టం, ప్రజల సహకారంతో ఏపీని మళ్లి అభివృద్ధి చేస్తాను,‘ అని స్పష్టం చేశారు.