రాష్ట్రంలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. కేంద్రప్రభుత్వంపై చంద్రబాబునాయుడు విరుచుకుపడ్డారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ,  ‘కేంద్రం గేమ్ మొదలుపెట్టింది..ఇక యుద్ధమే’ అంటూ చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. టిడిపిని అస్ధిరపరచాలని కొందరు పెద్దలు కుట్ర పన్నితే స్ధానికంగా ఉండే మరికొందరు భాగస్తులయ్యారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించటం గమనార్హం.

తమిళనాడు తరహాలోనే ఏపిలో కూడా ప్రభుత్వాన్ని కొందరు పెద్దలు అస్ధిర పరచాలని వ్యూహరచన చేస్తున్నట్లు చంద్రబాబు మండిపడ్డారు. బలమైన నాయకత్వాన్ని బలహీనపరచేందుక మహాకుట్ర జరుగుతోందన్నారు. టిడిపిని దెబ్బ కొట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ ధ్వజమెత్తారు. పవన్ ఆరోపణలు అర్ధరహితమని కొట్టేశారు. పవన్ నాటకాల స్ర్కిప్ట్  ఎక్కడి నుండి వచ్చాయో అందరికీ తెలుసన్నారు. ఎవరు ఎలాంటి రాజకీయాలు చేసినా వెనక్కు తగ్గద్దని చంద్రబాబు నేతలకు స్పష్టం చేశారు.