చంద్రబాబు: మిగిలింది గతమేనా ?

First Published 25, Dec 2017, 6:20 PM IST
Naidu recalls how he enjoyed primacy at center in the era of Vajpayee
Highlights
  • ‘ఓడలు బండ్లు..బండ్లు ఓడలు అవుతాయ’న్నది సామెతను అందరూ వినేవుంటారు.

‘ఓడలు బండ్లు..బండ్లు ఓడలు అవుతాయ’న్నది సామెతను అందరూ వినేవుంటారు. ఇపుడా సామెతను చెప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే, నిజంగానే వచ్చింది. ఎలాగంటే, ఈరోజు మాజీ ప్రధానమంత్రి అతల్ బీహారీ వాజ్ పేయ్ జన్మదినం. ఆ సందర్భంగా చంద్రబాబునాయుడు వాజ్ పేయ్ జన్మదినాన్ని గట్టిగానే జరిపారు. చాలా సంవత్సరాలుగా వాజ్ పేయ్ జన్మదినాన్ని చంద్రబాబు నలుగురిలో జరిపిన దాఖలాలు పెద్దగా లేవు. అటువంటిది హటాత్తుగా ఈసారి ఎందుకు జరిపారన్న విషయమై పెద్ద చర్చే జరుగుతోంది.

ఈ విషయం తెలియాలంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను కాస్త చెప్పుకోవాలి. గడచిన మూడున్నరేళ్ళుగా చంద్రబాబును ప్రధానమంత్రి నరేంద్రమోడి  ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఏడాదిన్నరగా కనీసం అపాయిట్మెట్ కూడా ఇవ్వలేదు. అంతేకాకుండా కేంద్రం నుండి ఎదురవుతున్న పరాభవాలను తట్టుకోలేకపోతున్నారు. అందుకే తనలో దాచుకున్న అసంతృప్తిని చంద్రబాబు ఈరోజు బహిర్గతం చేసినట్లు కనబడుతోంది. అందుకు వాజ్ పేయ్ పుట్టిన రోజు వేడుకని వేదికగా చేసుకున్నారు.

ఒక్క మాటకూడా మోడి గురించి మాట్లాడకుండానే వాజ్ పేయ్ జమానాలో వెలిగిపోయిన తన ప్రభ గురించి నెమరేసుకున్నారు.

చంద్రబాబు మాట్లాడుతూ, మాజీ వాజ్‌పేయ్ ని గొప్ప దార్శనికునిగా పరిపాలనా దక్షునిగా, పండితుడు, కవిగా ఆకాశానికెత్తేసారు.  అంతేకాకుండా తనకు వాజ్ పేయ్ కున్న సన్నిహితం గురించి వివరిస్తూ మంగళగిరి వద్ద ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కు అటల్ బిహారీ వాజ్‌పేయీ పేరు తానే సూచించానట్లు చెప్పుకున్నారు.

వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్నప్పుడే అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సైబరాబాద్ ను తాను నిర్మించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రపంచ ఐటి రంగ చిత్రపటంలో హైదరాబాద్ పేరు చిరస్థాయిగా నిలిచే విధంగా తీర్చి దిద్దినట్లు చెప్పారు. పోఖ్రాన్ అణుపరీక్షలతో భారత్ సత్తా చాటడమే కాదు, తన దార్శనికతను ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత వాజ్ పేయీ కే దక్కుతుందన్నారు.

స్వర్ణ చతుర్భుజి సహా మౌలిక రంగ అభివృద్ధికి వాజ్‌పేయి కాలంలో విశేష కృషి జరిగిందన్నారు. వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు ఎన్డీయే కన్వీనర్ గా తాను రాష్ట్రపతి అభ్యర్ధిగా ఏజీజే అబ్దుల్ కలాం పేరును సూచించిన విషయాన్ని చంద్రబాబు మననం చేసుకున్నారు. వాజ్ పేయ్ హయాంలో జాతీయ రాజకీయాల్లో తాను ఏ విధంగా చక్రం తప్పింది, తనకు వాజ్  పేయ్ వద్ద ఉన్న పలుకుబడి గురించి చెప్పారు. చివరగా వాజ్ పేయీ  నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో జీవించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

loader