‘కాపు’ అంశాన్ని కూడా కేంద్రంపైకే నెట్టేస్తున్న చంద్రబాబు

First Published 1, Dec 2017, 4:49 PM IST
Naidu now throwing the kapu ball  also into centres court
Highlights
  • కాపు రిజర్వేషన్లకు, కేంద్రప్రభుత్వానికి లింకా ? చంద్రబాబునాయుడు వరస చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.

కాపు రిజర్వేషన్లకు, కేంద్రప్రభుత్వానికి లింకా ? చంద్రబాబునాయుడు వరస చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఎందుకంటే, సామాజికవర్గానికి రిజర్వేషన్ శాతం పెంచాలన్నా, రిజర్వేషన్ పరిధిలోకి ఓ సామాజికవర్గాన్ని చేర్చాలన్నా పార్లమెంటు ద్వారా మాత్రమే సాధ్యం. ఇపుడున్న చట్టంలో మార్పులు చేర్పులు చేయాలంటే పార్లమెంటుకు మాత్రమే హక్కుందన్న విషయం అందరకీ తెలిసిందే. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం రిజర్వేషన్లు పెంచుకోవాలన్నా, కొత్తగా ఏ సామాజికవర్గాన్నైనా రిజర్వేషన్ల పరిధిలోకి చేర్చాలన్నా సాధ్యం కాదు.

40 ఇయర్స్ ఇండస్ట్రి అదే చంద్రబాబుకు ఆ విషయం తెలీదా? ఎందుకు తెలీదు ? పోయిన ఎన్నికల్లో ఎలాగైనా ముఖ్యమంత్రి అవ్వాలన్న ఏకైక లక్ష్యంతో కాపులను బిసిల్లోకి చేరుస్తానంటూ హామీ ఇచ్చేశారు. అదికూడా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పారు. సరే, అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి కాపుల విషయంలో చంద్రబాబు ఎన్ని మాటలు చెబుతున్నది? ముద్రగడ పద్మనాభం ఉద్యమాలు అన్నీ అందరికీ తెలిసినవే.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే, ఉద్యమాన్ని చల్లార్చటానికి చంద్రబాబు మంజూనాధ కమీషన్ ఏర్పాటు చేసారు. ఆ కమీషన్ దాదాపు రెండేళ్ళ పాటు రాష్ట్రంలో పర్యటించి అందరి అభిప్రాయాలు సేకరించింది. ఇదిలావుండగానే కాపులను బిసిల్లోకి చేర్చటాన్ని వ్యతిరేకిస్తూ బిసి సామాజికవర్గాలు కూడా ఉద్యమాలు చేస్తున్న సంగతి అందరూ చూస్తున్నదే. అంటే ఒకవైపు కాపులు, మరోవైపు బిసిలు ఉద్యమాలంటూ రోడ్డెక్కారు. సరే, మొత్తానికి కమీషన్ తన నివేదికను చంద్రబాబుకు అప్పగించేసింది.

ఇటువంటి పరిస్ధితుల్లోనే మంజూనాధ కమీషన్ నివేదికపై శుక్రవారం మంత్రివర్గంలో చర్చింది శనివారం అసెంబ్లీలో ప్రవేశ పెడుతున్నారట. అసెంబ్లీ అంటే ప్రస్తుతం అధికారపార్టీ మాత్రమే కదా? వైసిపి అసెంబ్లీని బహిష్కరించిన నేపధ్యంలో నివేదికను సభ ఆమోదించటం చాలా సులభం. తర్వాత అదే నివేదికను కేంద్రప్రభుత్వానికి పంపుతారట. ఎందుకంటే, కాపులను బిసిల్లో చేర్చే విషయమై నిర్ణయం తీసుకోవటానికి. అంటే, హామీ ఇచ్చింది చంద్రబాబైతే అమలు చేయాల్సింది కేంద్రమన్నమాట. పోలవరం నెపం లాగే కాపులకు రిజర్వేషన్ అంశాన్ని కూడా కేంద్రంపై నెట్టేయటానికి చంద్రబాబు వ్యూహం సిద్ధం చేసుకుంటన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

అంటే పోయిన ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్ పై చంద్రబాబు ఇచ్చిన హామీ ఏంటి ? ఇపుడు జరుగుతున్న తంతంగమేంటి ? ఎతకాలం జనాలను మభ్య పెడదామని అనుకుంటున్నారో చంద్రబాబుకే తెలియాలి ? ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్ అంశం అన్నది టిడిపిపై ఓ ఐదారు జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశాలైతే కనబడుతున్నాయి. ఈ సమస్య నుండి చంద్రబాబు ఎలా గట్టెక్కుతారో చూడాలి ?

loader