మహిళా బిల్లుకు చంద్రబాబు ఏపాటి మద్దతు ఇస్తున్నారో కూడా స్పష్టం చేయాలి. ఆచరణలో చూపాలి. అపుడే మహిళలు నమ్ముతారు.

‘ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి’ అని ఓ పాటుంది. అలాగే ఉంది చంద్రబాబునాయుడు చెబుతున్న మాటలు. స్త్రీ పురుష సమానత్వానికి అందరూ సహకరించాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చంద్రబాబు చెప్పారు. అంతవరకూ బాగానే ఉంది. ఆ విషయం ఇతరులకు చెప్పేముందు తాను ఆచరించి చూపితే బాగుంటుంది. ఎందుకంటే, ఇపుడు జరుగుతున్న ఎంఎల్సీ ఎన్నికల్లో ఎంత మంది మహిళలకు చంద్రబాబు టిక్కెట్లు ఇచ్చారు? స్ధానిక సంస్ధల కోటాలో 9 సీట్లున్నాయి. అందులో ఒక్కరికీ అవకాశం ఇవ్వలేదు. పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు జరుగుతున్న ఎన్నికల్లోనూ ఎవరికీ టిక్కెట్టు ఇవ్వలేదు. ఎంఎల్ఏల కోటాలో 7 సీట్లలో మాత్రం ఒక్కరికి అవకాశం ఇచ్చారు. అది కూడా ఎంతో ఒత్తిడి పెడితే ఇచ్చారు.

టిక్కెట్ల కేటాయింపు అంశం తన పరిధిలోనిదే కదా? వివిధ కోటాల్లో కలిపి మరో ఐదారుగురికి ఎందుకు అవకాశం కల్పించలేకపోయారు? ఏం అర్హులైన మహిళలు లేరా? సినీనటి కవిత, పంచుమర్తి అనురాధ, ముళ్ళపూడి రేణుక లాంటి మహిళా నేతలు దశాబ్దాల తరబడి పార్టీకి సేవలందిస్తున్నారు కదా? టిక్కెట్లు ఇచ్చే సమయానికి వారెవరూ ఎందుకు కనిపించ లేదు చంద్రబాబుకు?

సరే, ఆ విషయాన్ని పక్కనబడితే, వైసీపీ ఎంఎల్ఏ రోజాను మహిళా సదస్సుకు ఆహ్వానించి మరీ ఎందుకు అరెస్టు చేయించినట్లు? ఏ నిబంధనల ప్రకారం అసెంబ్లీ నుండి రోజాను ఏడాది సస్పెండ్ చేసారో చంద్రబాబు చెప్పగలరా? మరో రెండేళ్ళు కూడా సభలోకి అడుగుపెట్టనీయకూడదని టిడిపి ఎందుకు కుట్రలు చేస్తోంది? చంద్రబాబు అనుమతి లేకుండానే ఇదంతా జరుగుతోందా?

అంతెందుకు, టిడిపి అధిరారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు, దాడులు బాగా పెరిగిపోయాయని పోలీసు రికార్డులే చెబుతున్నాయి కదా? నిందుతులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? మహిళా బిల్లుకు చంద్రబాబు ఏపాటి మద్దతు ఇస్తున్నారో కూడా స్పష్టం చేయాలి. ఆచరణలో చూపాలి. అపుడే మహిళలు నమ్ముతారు. లోకానికి సుద్దులు చెప్పేముందు చంద్రబాబు తాను ఆచరించాలి. తర్వాతే ఇతరులకు చెప్పాలి. అప్పుడే వినేవాళ్ళకు కూడా బాగుంటుంది.