వివేకానందరెడ్డిని ఓడించటమంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించటంగానే చంద్రబాబు భావిస్తున్నారు. కాబట్టే ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందులో భాగంగానే చెంగల్రాయడును టిడిపిలోకి లాక్కున్నారు.

స్కూల్లో చిన్న పిల్లాడిని ఆవుపై వ్యాసం రాయమంటే రాసిందే రాసాడట. అలాగే ఉంది చంద్రబాబునాయుడు ఉపన్యాసాలు. సందర్భం ఏదైనా సరే చంద్రబాబు మాత్రం హైదరాబాద్ ను తానే నిర్మించానని, హైటెక్ సిటీ నిర్మించానని, సైబరాబాద్, ఔటర్ రింగ్ రోడ్డు తన హయాంలోనో ఏర్పడ్డాయని చెప్పుకుంటుంటారు. తన తర్వాత ఇంతవరకూ హైదరాబాద్ లో డెవలప్మెంటే జరగలేదని చెబుతుంటారు.

ఇక, రాష్ట్ర విభజన గురించి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్నిఅడ్డుగోలుగా విభజించిందంటారు. కట్టుబట్టలతో హైదరాబాద్ నుండి వచ్చేసామని, రాజధాని కూడా లేకుండానే రాష్ట్రాన్ని విడగొట్టారని అంటారు. తెలుగు వాళ్లకి బ్రహ్మాండమైన రాజధానిని నిర్మించేందుకే తాను 24 గంటలూ కష్టపడుతున్నట్లు చెబుతారు. తాను 24 గంటలూ రాష్ట్రాభివృద్ధిగురించే ఆలోచిస్తుంటే ప్రతిపక్షాలు రాక్షసుల్లాగ అడ్డుపడుతున్నాయంటూ ధ్వజమెత్తుతారు. తన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే వైసీపీ ఎంఎల్ఏలతో పాటు ఇతర పార్టీల నేతలు టిడిపిలో చేరుతున్నట్లు చెప్పేసుకుంటారు.

తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎంఎల్సీ చెంగల్రాయడు టిడిపిలో చేరారు. ఆ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధిగురించి, అమరావతి గురించి, రాష్ట్ర విభజన విషయాలనే ప్రస్తావించారు. నిజానికి చెంగల్రాయుడు పదవీ కాలం మార్చినెలతో పూర్తవుతోంది. అదే మార్చినెలలో కడప జిల్లాలో స్ధానిక సంస్ధల కోటాలో ఎంఎల్సీ ఎన్నిక జరుగుతోంది. వాస్తవానికి టిడిపి అభ్యర్ధికి, వైసీపీ అభ్యర్ధి వివేకానందరెడ్డికి మధ్య గట్టి పోటీ జరుగుతోంది. గెలుపోటములను ముందుగా ఊహించటం కష్టంగా ఉంది.

ఇటువంటి పరిస్ధితుల్లో టిడిపి అభ్యర్ధిగనుక ఓడిపోతే అది ప్రభుత్వానికి అవమానం. దాంతో చంద్రబాబులో ఆందోళన పెరిగిపోతోంది. వివేకానందరెడ్డిని ఓడించటమంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించటంగానే చంద్రబాబు భావిస్తున్నారు. కాబట్టే ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందులో భాగంగానే చెంగల్రాయడును టిడిపిలోకి లాక్కున్నారు. ఎందుకంటే, చెంగల్రాయడు చేతిలో స్ధానికి సంస్ధలకు సంబంధించి కొన్ని ఓట్లున్నాయి. పైగా ఆయన బలిజ నేత కూడా. అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలని చంద్రబాబు అనుకున్నారు. అయితే, చంద్రబాబు రాజకీయం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.