ఓటుకునోటు కేసు దెబ్బ చంద్రబాబునాయుడుపై బాగా ప్రభావం చూపుతోంది. ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో కేసు దెబ్బకు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ ను అర్ధాంతరంగా వదిలేసిన సంగతి అందరికీ తెలిసిందే. అటువంటిది తాజాగా తెలంగాణాలో పార్టీ నాయకత్వానికి కూడా దూరం చేసేసింది.

సహజంగా ప్రాంతీయ పార్టీలంటేనే వ్యక్తులు, కుటుంబాల చేతుల్లో ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. అటువంటిది టిడిపికి తెలంగాణాలో తమ  కుటుంబం తరపున ఎవరు నాయకత్వ బాధ్యతలు తీసుకోరని చంద్రబాబు బహిరంగంగానే చెప్పారంటే అందుకు కారణం ఓటుకునోటు కేసు తప్ప మరోటి కాదని అర్ధమైపోతోంది.

బుధవారం సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణా నేతలు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పలువురు కార్యకర్తలు ప్రస్తుత నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణాలో పార్టీ బతికి బట్టకట్టాలంటే జూనియర్ ఎన్టీఆర్, లోకేష్ లేదా బ్రాహ్మణిల్లో ఎవరో ఒకరికి పార్టీ సారధ్య బాధ్యతలు అప్పగించాలంటూ గట్టిగా డిమాండ్ చేశారు.

ఆ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తమ కుటుంబం నుండి పార్టీ నాయకత్వ బాధ్యతల్లో ఎవరూ ఉండరంటూ స్పష్టంగా ప్రకటించారు. అంటే అర్ధమేంటి? తమ కుటుబంలో జూనియర్ ఎన్టీఆర్ మినహా ఇంకెవరు సారధ్య బాధ్యతలు తీసుకున్నా తనకు ఇబ్బందులు ఎదురవుతాయని చంద్రబాబు భయపడుతున్నట్లే ఉన్నారు. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబు కుటుంబానికి సంబంధం లేదు. అయితే పార్టీ బాధ్యతలు జూనియర్ ఎన్టీఆర్ కు అప్పగించటం చంద్రబాబుకు ఏమాత్రం ఇష్టం లేదని అర్ధమైపోయింది. అందుకే ‘తమ కుటుంబం’ అన్న పదం వాడారు.

ఓటుకునోటు కేసు సుప్రింకోర్టు విచారణలో ఉంది. విచారణ ఎప్పుడు వేగవంతమవుతుందో ఎవరూ చెప్పలేకున్నారు. సుప్రింకోర్టులోనే చాలాకాలంగా  నానుతోంది. మొన్నటి ఫిబ్రవరి 5వ తేదీనే విచారణ మొదలవ్వాలి. ఇంతలో కేసులో నాలుగో నిందితుడైన జెరూసలెం ముత్తయ్య తాను అప్రూవర్ గా మారటానికి అంగీకరిచాలంటూ సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ కు పిటీషన్  పెట్టుకోవటం కలకలం రేపింది.

ఒకవేళ చీఫ్ జస్టిస్ గనుక అందుకు అనుమతిస్తే కేసు విచారణ ఒక్కసారిగా వేగం పుంజుకునే అవకాశముంది. దాంతో ఓటుకునోటు కేసులో నుండి బయటపడేంత వరకూ తన కుటుంబం సభ్యులెవరినీ తెలంగాణాలో సారధ్య బాధ్యతలకు దూరంగా ఉంచాలని చంద్రబాబు అనుకున్నట్లు తెలుస్తోంది.