చంద్రబాబుకు రావెల షాక్ తప్పదా ?

First Published 28, Nov 2017, 3:09 PM IST
Naidu is worried about ravelas political move
Highlights

చంద్రబాబునాయుడులో గుబులు మొదలయ్యింది.

చంద్రబాబునాయుడులో గుబులు మొదలయ్యింది. ఒకవైపు వైసిపి ఎంఎల్ఏలను లాక్కుంటున్నారు. ఇంకోవైపు అసెంబ్లీని ఏకపక్షంగా జరుపుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షమన్నదే లేకుండా చేయాలని గట్టి వ్యూహాలు పన్నుతూ బిజిగా ఉంటున్నారు. అయినా చంద్రబాబులో గుబులేంటా? అని ఆశ్చర్యపడుతున్నారా? అయితే, ఈ కథనం చదవాల్సిందే.

ఇంతకీ చంద్రబాబులోని గుబులుకు కారణమేంటంటే, స్వపక్షంలోని ఓ ఎంఎల్ఏనే. అదికూడా రాజధాని గుంటూరు జిల్లాలోని ఎంఎల్ఏ వల్లే చంద్రబాబు ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. గడచిన మూడున్నరేళ్ళల్లో చంద్రబాబు 23 మంది వైసిపి ఎంఎల్ఏలను, ముగ్గురు ఎంపిలను ఫిరాయింపులకు ప్రోత్సహించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఎదుటి వాళ్ళ కొంపలో చిచ్చు పెడుతున్నపుడు మనకి బాగానే ఉంటుంది. అదే చిచ్చు మన కొంపలో మొదలైతే ఎలాగుంటుంది? తన పరిస్ధితి అదే విధంగా తయారవుతుందేమోననే చంద్రబాబులో ఆందోళన మొదలైందట. ఇంతకీ ఏంటా చిచ్చు? అదే ఫిరాయింపుల ద్వారా వైసిపి ఎంఎల్ఏలను టిడిపిలోకి లాక్కోవటం. దాని ద్వారా జగన్మోహన్ రెడ్డిని మానసికంగా బలహీనుణ్ణి చేయటమే చంద్రబాబు వ్యూహం.

మరి, అదే పద్దతిలో టిడిపి  నుండి ఎవరైనా ఓ ఎంఎల్ఏ వైసిపిలోకి ఫిరాయించారనుకోండి ఎలాగుంటుంది? ఇంతకాలం జగన్ ను దెబ్బకొడుతున్న చంద్రబాబు అదే దెబ్బ తనకే రివర్స్ లో తగిలితే ? ఇపుడు చంద్రబాబులో ఆ గుబులే మొదలైందట. జిల్లాలోని ప్రత్తిపాడు ఎంఎల్ఏ రావెల కిషోర్ బాబు విషయంలోనే చంద్రబాబు బాగా వర్రీ అయిపోతున్నారట.

మంత్రివర్గంలో నుండి తొలగించిన తర్వాత రావెల ఒక విధంగా చంద్రబాబుకు మేకులాగ తయారయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. పార్టీ నేతలతో టచ్ లో లేరు. రావెల  ఏం చేస్తున్నారో కూడా పార్టీ నేతల వద్ద పెద్దగా సమాచారం లేదట. దానికి తగ్గట్లే రావెల తొందరలో పార్టీకి రాజీనామా చేస్తారంటూ ఎప్పటి నుండో ప్రచారం జరుగుతోంది. వైసిపి ఎంపి వైవి సుబ్బారెడ్డిని కలిసినట్లు ప్రచారం కూడా జరుగుతోంది. ఆ ప్రచారమే చంద్రబాబులో గుబులు రేపుతోంది.

వైసిపి నుండి ఎంతమందిని లాక్కున్నామన్నది కాదు ముఖ్యం. టిడిపి నుండి ఒక్క ఎంఎల్ఏ బయటకు పోయినా, అందులోనూ వైసిపిలో చేరితే చంద్రబాబుకు అంతకన్నా పెద్ద అవమానం ఇంకోటుండదు. అంటే 23 మంది ఫిరాయింపు ఎంఎల్ఏలకు ఒక్క టిడిపి ఎంఎల్ఏ సమానమన్నమాట. చంద్రబాబులోని గుబులు తొందరలోనే నిజమవుతుందని టిడిపి వర్గాలు అనుమానిస్తున్నాయి. చూడాలి ఏం జరుగుతుందో ?

loader