నిజంగానే చంద్రబాబునాయుడుకు పిచ్చ హ్యాపీగా ఉంది. వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన తర్వాత బోటు ప్రమాదం జరగటంతో చంద్రబాబు హ్యాపీగాా ఉన్నారు.  అదే గనుక ఇపుడు వైసీపీ సభలోనే ఉండివుంటే చంద్రబాబుకు చుక్కలు కనిపించేదే.  ప్రధాన ప్రతిపక్షం వైసీపీ లేని లోటు అసెంబ్లీ సమావేశాల్లో బాగానే తెలుస్తోంది. కానీ అసెంబ్లీలో వైసీపీ లేకపోవటంతోనే అధికారపక్షం నిజంగా సంతోష పడుతోంది. దానికి కారణం బోటు ప్రమాదం ఘటనే. ఆదివారం సాయంత్రం ఇబ్రహింపట్నం ఫెర్రీ వద్ద జరిగిన బోటు ప్రమాదంలో 20 మంది మరణించారు. గల్లంతైన వారికోసం ఇంకా గాలింపు చర్యలు జరుగుతున్నాయి.

ఇటువంటి సమయంలో గనుక వైసీపీ అసెంబ్లీలో ఉండివుంటే చంద్రబాబుకు, టిడిపికి నిజంగానే జగన్ సైన్యం చుక్కలు చూపించేదనటంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఎందుకంటే, జరిగిందో ఏదో ప్రమాదం కాదు. పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 20 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.  పవిత్ర సంగమం వద్ద ఇంత పెద్ద ప్రమాదం సంభవించినపుడు ప్రభుత్వ పరంగా రావాల్సిన స్పందన సక్రమంగా లేదు.

ఎందుకంటే, ప్రమాదానికి కారణమైన బోటుకు తిరగటానికి అనుమతి లేదు. టిడిపి పెద్దల జోక్యం లేకుండానే ఇంత ప్రముఖ స్ధలంలో అంతపెద్ద బోటు ఎలా తిరుగుతుంది? ఈ ఒక్క బోటే కాదు సుమారు 30 బోట్లు అనుమతి లేకుండానే విచ్చలవిడిగా తిరుగుతున్నట్లు ఆరోపణలు వినబడుతున్నాయి. అంటే ప్రతీ చోటా అధికారపార్టీ నేతల జోక్యం ఏ స్ధాయిలో ఉందో అర్ధమవుతోంది. ఇటువంటి పరిస్ధితుల్లో గనుక వైసీపీ అసెంబ్లీలో ఉండివుంటే చంద్రబాబును గుక్కతిప్పుకోనిచ్చే వారు కాదు వైసీపీ ఎంఎల్ఏలు. అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించింది కాబట్టే చంద్రబాబైనా, టిడిపి అయినా ఇంత నింపాదిగా ప్రమాదంపై స్పందించారు.