ఉద్యమాన్ని అణిచివేయాలనే యోచనలో యువతను రెచ్చగొడుతున్నాననే విషయాన్ని గమనించటం లేదు. ఒకసారి యువత రెచ్చిపోతే అదుపు చేయటం అంత సులభం కాదు.
చంద్రబాబునాయుడు ప్రభుత్వం యువతతో తలగోక్కుంటోంది. 26వ తేదీ ప్రత్యేకహోదా ఉద్యమాన్ని అణిచివేయటం ద్వారా తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకుందాని చూస్తోంది. ఏపికి ప్రత్యేకహోదా, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేకరైల్వేజోన్ అన్నది రాష్ట్ర ప్రజల హక్కు. రాష్ట్ర విభజన సందర్భంగా నాటి ప్రభుత్వం రాజ్యసభ సాక్షిగా ప్రజలకిచ్చిన హామీ. అటువంటి హక్కును సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు కేంద్రం వద్ద తాకట్టుపెట్టారు. ఇంతకాలం హక్కుల గురించి పట్టించుకోని యువత జల్లికట్టు పుణ్యమా అని ఇప్పటికి నిద్ర మేల్కొంది.
విశాఖపట్నంలోని ఆర్కె బీచ్ వేదికగా ఉద్యమానికి మళ్లీ ఊపిరి పోద్దామని యువత అనుకున్నది. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ చంద్రబాబుకు రాసిన బహిరంగ లేఖలూ కారణం కావచ్చు. దానికి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మద్దతుతో ఊపొచ్చింది.
ఎప్పుడైతే వైసీపీ కూడా ఉద్యమంలో పాలుపంచుకుంటోందో అప్పటి నుండే చంద్రబాబులో అసహనం మొదలైంది. వైసీపీ ప్రజల మద్దతు పొందటం చంద్రబాబుకు ఏమాత్రం ఇష్టం లేదు. దాంతో ఉద్యమానికి అడ్డంకులు సృష్టించటం మొదలుపెట్టారు. చంద్రబాబు ధోరణి చూస్తుంటే 2003లో జరిగిన విద్యుత్ ఉద్యమం గుర్తుకొస్తోంది. ప్రత్యేకహోదా విషయంలో ప్రజల ఆకాంక్షను కేంద్రానికి తెలియకుండా అడ్డుకుందామని చంద్రబాబు చూస్తున్నారు.
‘ప్రత్యేక’ డిమాండ్లను సాధించే శక్తిని చంద్రబాబు ఎప్పుడో కోల్పోయారన్న విషయం అందరికీ తెలుసు. తాను సాధించలేకపోయినా పర్వాలేదు కానీ ప్రతిపక్షాలకు మాత్రం ఉద్యమాల ద్వారా పొలిటికల్ మైలేజ్ దక్కనీయకూడదన్న ఆలోచనే చంద్రబాబులో కనబడుతోంది. అందుకనే పోలీసుల ద్వారా ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఉద్యమాన్ని అణిచివేయాలనే యోచనలో యువతను రెచ్చగొడుతున్నాననే విషయాన్ని గమనించటం లేదు. ఒకసారి యువత రెచ్చిపోతే అదుపు చేయటం అంత సులభం కాదు. పవన్ కల్యాణ్ అభిమానులు అంటేనే చాలామందికి కనీసం ఓటుహక్కు కూడా వచ్చి ఉండదు. పైగా సామాజిక వర్గాల గొడవ. దీనికి వైసీపీ మద్దతు అదనం. ఉద్యమానికి వైసీపీ మద్దతు పలకకుండా ఉంటే చంద్రబాబు ధోరణి ఎలాగుండేదో? దానికి తోడు అయ్యన్నపాత్రుడు, రాయపాటి సాంబశివరావు లాంటి నేతలు పవన్ కల్యాణ్ ను బాగా రెచ్చగొడుతున్నారు. వేదిక వద్ద అదనపు పోలీసు బలగాలను దింపి ఏదో అయ్యిందంటే అయ్యిందని పిద్దామన్న కనీస విజ్ఞత కూడా చంద్రబాబు ప్రభుత్వంలో లోపించటం నిజంగా దురదృష్టమే.
