జన్మభూమి: ‘దేశం’ నేతలకు పెద్ద షాక్

Naidu getting intelligence reports daily on janmabhoomi programme
Highlights

  • తెలుగుదేశంపార్టీ నేతల పనితీరుకు జన్మభూమి కార్యక్రమాలు పెద్ద పరీక్షగా మారిపోయింది.

తెలుగుదేశంపార్టీ నేతల పనితీరుకు జన్మభూమి కార్యక్రమాలు పెద్ద పరీక్షగా మారిపోయింది. కార్యక్రమాల నిర్వహణ తీరును చంద్రబాబునాయుడు ప్రతీరోజు ఇంటెలిజెన్స్ నివేదికలను తెప్పించుకుంటున్నారట.  నివేదికల ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో నేతల జాతకాలు రాయనున్నట్లు సమాచారం. రాబోయేది ఎన్నికల సీజన్ కాబట్టి చంద్రబాబునాయుడు ఇప్పటి నుండే జాగ్రత్తలు తీసుకుంటున్నారట. మూడు నాలుగు అంశాలపై ప్రత్యేక శ్రద్ద తీసుకుని ఆరాతీయాలని ఇంటెలిజెన్స్ అధికారులకు చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.

ఐదు రోజుల క్రితం మొదలైన జన్మభూమి కార్యక్రమం చాలా చోట్ల గందరగోళం మధ్యే జరుగుతోంది. అందుకు ప్రధాన కారణాలను విశ్లేషించాలని చంద్రబాబు ఆదేశించారట. ఎంఎల్ఏలు, నియోజకవర్గ ఇన్చార్జీల పనితీరుకు జన్మభూమి కార్యక్రమాల నిర్వహణ పెద్ద పరీక్షగా మారింది. ఎలాగంటే జన్మభూమి కార్యక్రమాల్లో ఎటువంటి గందరగోళం రేగకుండా విజయవంతం చేయటంలోనే వారి సామర్ధ్యం ఆధారపడి ఉందన్నది చంద్రబాబు ఆలోచన. కానీ అనుకున్నదొకటైతే జరుగుతున్నది మరొకటి. అందుకనే అన్నీచోట్లా ఇంటెలిజెన్స్ ను రంగంలోకి దంపేసారు.

చాలా చోట్ల జనాలు మంత్రులు, ఎంఎల్ఏలతో పాటు అధికారులను కూడా ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. పోయిన జన్మభూమి కార్యక్రమాల్లో తమకిచ్చిన హామీల అమలును, పోయిన ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై జనాలు నిలదీస్తున్నారు. అందులో కూడా ప్రధానంగా ఇంటి స్ధలాలు, రేషన్ కార్డులు, ఫించన్లు తదితరాలున్నాయి. అవి ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో తీరే సమస్యలు కావు. అందుకనే ఎంఎల్ఏలు, నేతలు జనాల నిలదీతలను తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.

ఇటువంటి ఘటనలను చంద్రబాబు రోజు వారీ నివేదికల రూపంలో ప్రతీ రోజూ తెప్పించుకుంటున్నారట. ఈ నివేదికల ఆధారంగా మంత్రులు, ఎంఎల్ఏలు, నేతల పనితీరును చంద్రబాబు లెక్కిస్తున్నారట. సరే, వచ్చే ఎన్నికల్లోగా మూడో, నాలుగో జన్మభూమి కార్యక్రమాలను ఎటూ నిర్వహిస్తారనటంలో సందేహం లేదు. జన్మభూమి కార్యక్రమాల్లాంటి వాటి ద్వారానే జనాల్లో డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నికల మ్యానిఫెస్టో రూపకల్పనలో ఉపయోగపడుతుందని చంద్రబాబు ఆలోచిస్తున్నారట.

loader