అనంతపురం టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డిని ఎలా కంట్రోల్లో పెట్టాలో చంద్రబాబునాయుడుకు అర్ధం కావటం లేదు. నిజాలు మాట్లాడుతాను అన్న ముసుగులో చంద్రబాబుకు ఎప్పటికప్పుడు తలనొప్పులు తెస్తున్నారు. జెసి వ్యవహారశైలిపై ఇప్పటికే అనేక ఫిర్యాదులున్నా చంద్రబాబు ఏమీ చేయలేకపోతున్నారు. తాజాగా కేంద్ర-టిడిపి సంబంధాలపై జెసి చేసిన వ్యాఖ్యలు పార్టీలో సర్వత్రా చర్చకు దారితీసింది.

కేంద్రప్రభుత్వం వద్ద టిడిపి పరిస్ధితి ఆరోవేలు లాగ తయారైందన్నారు. ‘ఆరోవేలు వల్ల ఎంత ఉపయోగమో టిడిపి వల్ల కూడా అంతే’ అంటూ చేసిన వ్యాఖ్యలతో నేతలు ఉలిక్కిపడ్డారు. అసలే భాజపా-టిడిపి మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. భాజపా ఎంఎల్సీ సోము వీర్రాజు ఏకంగా చంద్రబాబునాయుడుపైనే రెచ్చిపోతున్న విషయం అందరూ చూస్తున్నదే.

ఇటువంటి నేపధ్యంలో భాజపాతో ఉండటం వల్ల టిడిపికి గానీ రాష్ట్రానికి గానీ వచ్చిన ఉపయోగం ఏమీ లేదని చెప్పటం టిడిపి నేతలకు మింగుడుపడటం లేదు. జెసి వ్యాఖ్యలను సాకుగా తీసుకుని మళ్ళీ భాజపా నేతలు ఎక్కడ రెచ్చిపోతారో అనే ఆందోళన టిడిపిలో స్పష్టంగా కనబడుతోంది. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలే ఇవ్వనపుడు ఇక వ్యక్తిగత ప్రయోజనాలను ఏమీ చేస్తారంటూ కేంద్రంపై జెసి మండిపడ్డారు.

ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేకపోవటమే నరేంద్రమోడికి కలసివచ్చిందని జెసి స్పష్టంగా చెప్పారు. రాష్ట్రానికి ఇంతకాలం ఏమీ చేయని కేంద్రం ఇపుడు మాత్రం ఏమి చేస్తుందన్నట్లుగా జెసి మాట్లాడారు. సరే, ఏదేమైనా జెసి వ్యాఖ్యలపై ఇపుడు పార్టీలో చర్చే జరుగుతోంది. జెసిని కంట్రోల్ చేయటం చంద్రబాబుకు కూడా సాధ్యం కావటం లేదు. దాంతో జెసిని ఎలా కంట్రోలు చేయాలో అర్ధం కాక చంద్రబాబు తల పట్టుకుంటున్నారు.