నరేంద్రమోడి పేరెత్తాలంటేనే చంద్రబాబునాయుడు భయపడిపోతున్నట్లు కనిపిస్తోంది. శనివారం గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో ఇంజనీరింగ్ కళాశాల భవనాల ప్రారంభోత్సవంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఆ సందర్భంగా విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్రం ఇటీవలే ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపికి అన్యాయం జరిగిందని ఒకవైపు రాజకీయంగా దుమారం రేగుతున్నా చంద్రబాబు మాత్రం బడ్జెట్ పై ఒక్కమాట కూడా మాట్లాడలేదు.

ఈరోజు ఇంజనీరింగ్ విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడే సమయంలో అయినా కేంద్రం గురించి బడ్జెట్ గురించి మాట్లాడుతారని అనుకుంటే ఇక్కడ కూడా మాట్లాడేలేదు. ఎంతసేపు రాష్ట్ర విభజన జరిగిన తీరు, ఏపికి అన్యాయం జరిగిందనే ఆవు కథనే తిప్పి తిప్పి చెప్పారు. ఏపికి బడ్జెట్లో అన్యాయం జరిగింది కాబట్టి న్యాయం చేయమని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. బడ్జెట్లో ఏమన్యాయం జరిగింది? తాను కోరుకుంటున్న న్యాయమేంటి? అన్న విషయం మాత్రం ఒక్క ముక్క కూడా చెప్పలేదు.

పైగా ఆంధ్రుల ఆత్మగౌరవం కోసమే టిడిపి పెట్టిన సంగతి అందరూ గుర్తుంచుకోవాలంటూ విద్యార్ధులకు పిలుపివ్వటం విచిత్రంగా ఉంది. విభజన సమయంలో అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అన్యాయం చేస్తే ఇపుడు అధికారంలో ఉన్న ఇంకో పార్టీ అంటూ ఏదో చెప్పబోయి వెంటనే మాట మార్చేశారు. విభజన చట్టంలోని హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మూడున్నరేళ్ళలో ఏపికి కేంద్రం చేసిన సాయంపై చర్చకు సిద్దమన్నారు.

రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై లెక్కలడగటం కరెక్ట్ కాదన్నారు. కొన్ని పార్టీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పనిచేస్తాయంటూ పేరెత్తకుండానే వైసిపిని విమర్శించారు. మొత్తానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఇన్ని రోజులకు చంద్రబాబు బహిరంగంగా మాట్లాడటం గమనార్హం.