కర్నూలు స్ధానిక సంస్ధల ఎంఎల్సీ టిడిపి అభ్యర్ధిగా కెఇ ప్రభాకర్ ను చంద్రబాబునాయుడు ప్రకటించారు. అభ్యర్ధి ఎంపికపై చంద్రబాబు సోమవారం ఉదయం నుండి జిల్లా నేతలతో సుదీర్ఘ సమావేశాలు నిర్వహించారు. జిల్లా రాజకీయాల్లో  కెఇ కుటుంబానికున్న పట్టు, కెఇ సోదరులు పార్టీకి చేసిన సేవలు, బిసి సామాజికవర్గంలో వారికున్న పట్టు తదితరాలను పరిగణలోకి తీసుకున్న చంద్రబాబు, కెఇ ప్రభాకర్ ను అభ్యర్ధిగా నిర్ణయించారు. సోదరుడు కెఇ కృష్ణమూర్తి ఉప ముఖ్యమంత్రి ఉండటం కూడా ప్రభాకర్ కు బాగా కలసి వచ్చింది.

దానికి తోడు ఇప్పటి వరకూ జిల్లాకు వచ్చిన నామినేటెడ్ పదవులన్నీ నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని నేతలకే దక్కింది. ఆ విషయంలో కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలోని నేతల్లో అసంతృప్తి బాగా కనబడుతోంది. దానికి తోడు మొన్ననే ప్రభుత్వం కాపులను బిసిల్లోకి చేరుస్తూ తీసుకున్న నిర్ణయంతో బిసిలు బాగా మండుతున్నారు. రేపటి ఎన్నికల్లో పార్టీ గెలుపోటములపై బిసి-కాపు రిజర్వేషన్ సమస్య కీలకంగా మారనుంది. అందుకనే బిసి నేతైన కెఇ ప్రభాకర్ ను ఎంఎల్సీ అభ్యర్ధిగా చంద్రబాబు ప్రకటించారు. సరే, ఎటూ వైసిపి పోటీ నుండి తప్పుకోవటంతో కెఇ గెలుపు ఇక లాంఛనమే అని చెప్పుకోవచ్చు.