అమరావతి ప్రాంతాన్ని ఫ్రీజోన్ గా ముఖ్యమంత్రి ప్రకటించారు.

ఎట్టకేలకు అమరావతి ప్రాంతం ఫ్రీజోన్ అయింది. రాష్ట్ర రాజధాని అమరావతిని ఫ్రీ జోన్ గా ముఖ్యమంత్రి సోమవారం ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన జన్మభూమి కార్యక్రమం సందర్భంగా ముచ్చుమర్రిలో చంద్రబాబు మాట్లాడుతూ రాజధాని ప్రాంతాన్ని అందరి సౌలభ్యం కోసం ఫ్రీజోన్ చేస్తున్నట్లు చెప్పారు.

అంటే భవిష్యత్తులో ప్రభుత్వం గనుక ఉద్యోగాల భర్తీని చేపడితే 13 జిల్లాలకు సంబంధించిన ఎవరైనా ఇక్కడ నియమితులు కావచ్చు. అదే విధంగా వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అమరావతి ప్రాంతానికి డెప్యుటేషన్, బదిలీపై రావచ్చు. రాజధాని ప్రాంతంమైన అమరావతి ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ఉంది.

ఉద్యోగులకు సంబంధించిన జోనల విధానం వల్ల గుంటూరు, కృష్ణా జిల్లాలు వేర్వేరు జోన్లలో ఉన్నాయి. అలాగే, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల్లోని కొన్ని జిల్లాలు వేర్వేరు జోన్లలో ఉన్నాయి. దాంతో ఉద్యోగుల బదిలీ, పదోన్నతి, నియామకాలు అన్నీ సమస్యలే.

అందుకనే, అమరావతి ప్రాంతాన్ని ఫ్రీజోన్ గా చేయమని ఉద్యోగ సంఘాల నేతలు చాలా కాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ఈ డిమాండ్ ను గుంటూరు ప్రాంత ఉద్యోగ సంఘాల నేతల్లో కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత అమరావతి ప్రాంతాన్ని ఫ్రీజోన్ గా ముఖ్యమంత్రి ప్రకటించారు.