మంత్రులు కూడా చంద్రబాబుకు తగ్గట్లే తయారవుతున్నారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని మంత్రులు వాపోయారట. ఎలాగుంది మంత్రుల బాధ. ప్రభుత్వం చేసే ప్రతీ పనిని సమర్ధిస్తుంటే వాటిని ప్రతిపక్షాలని ఎందుకంటారు?

మంత్రులు, నేతలపై చంద్రబాబునాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. పార్టీలో సమన్వయం లోపించిన కారణంగానే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయంటూ చద్రబాబు మండిపడ్డారు. ఈరోజు తన నివాసంలో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, కొందరు పార్టీ నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నంద్యాల నుండి శిల్పా మోహన్ రెడ్డి వెళ్ళిపోవటం, విజయవాడ ఎంపి కేశినేని నాని రవాణాశాఖ ఉన్నతాధికారులపై చేస్తున్న ఆరోపణలు, విశాఖపట్నం జిల్లాలో బయటపడిన భూకుంభకోణం, జిల్లాపార్టీ నేతల మధ్య వివాదాలు తదితరాలపై చర్చ జరిగింది.

తప్పు చేస్తే ఎంతటివారినీ ఉపేక్షించేది లేదంటూ అలావాటైన హూంకరింపులు చేసారు చంద్రబాబు. మంత్రుల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు త్రిసభ్య కమిటి వేయాలని సమావేశం నిర్ణయించింది. సింగపూర్ పర్యటన నుండి చింతకాయల అయ్యన్నపాత్రుడు తిరిగి రాగానే నేరుగా మాట్లాడాలని చంద్రబాబు నిర్ణయించారు.

మొత్తానికి మంత్రులు కూడా చంద్రబాబుకు తగ్గట్లే తయారవుతున్నారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని మంత్రులు వాపోయారట. ఎలాగుంది మంత్రుల బాధ. ప్రభుత్వం చేసే ప్రతీ పనిని సమర్ధిస్తుంటే వాటిని ప్రతిపక్షాలని ఎందుకంటారు? కొతమంది ఉన్నతాధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారట. దానికి ప్రతిపక్షాలేం చేస్తాయ్?

అసెంబ్లీ బ్లాకు మొత్తం మీద ఒక్క జగన్ ఛాంబర్లో మాత్రమే వర్షపు నీరు ఎందుకు లీకైందో ప్రజలు ఆలోచించాలట. సరే, మంత్రుల మాట ప్రకారం జగన్ ఛాంబర్లో వర్షపు నీరు కారటం వైసీపీ కుట్రే అనుకుందాం. మరి, ప్రహరీగోడ ఎందుకు కూలిపోయింది? అది కూడా వైసీపీ కుట్రేనా? అంటే నిర్మాణాలు నాసిరకం కాదని నిరూపించేందుకు ప్రభుత్వం ఎంత అవస్తలు పడుతోందో అర్ధమైపోతోంది. మొత్తానికి ‘యథారాజా తధా ప్రజా’ అన్న మాటను మంత్రులు నిజం చేస్తున్నారు.