ఓటుకు నోటు కేసంటారా అది ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యల ఖర్మ. వారికి శ్రీకృష్ణ జన్మస్ధానం రాసిపెట్టి ఉంది కాబట్టి కొద్ది రోజులు జైలు పాలయ్యారు.

‘నైతిక విలువలతోనే నిజమైన ఆనందం పొందవచ్చు’..ఈ మాటలు చెప్పింది ఎవరా ని ఆలోచిస్తున్నారా ? నైతిక విలువల గురించి చెప్పే హక్కు ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఉందంటే అది ఒక్క నిప్పు చంద్రబాబునాయడుకు మాత్రమే. ఎందుకంటే, సుదీర్ఘ రాజకీయాల్లో నైతిక విలువలకు కట్టుబడి ఉన్నది, పాటిస్తున్నదీ ఒక్క చంద్రబాబు మాత్రమే.

వైసీపీ తరపున గెలిచిన 22 మంది ఎంఎల్ఏలను టిడిపిలోకి చేర్చుకోవటమన్నది ఏమాత్రం అనైతికం కానేకాదు. అదేవిధంగా వైసీపీ తరపున గెలిచిన ఎంపిలను పార్టీలోకి చేర్చుకోకుండానే టిడిపిలో తిప్పుకుంటున్నదీ అనైతికం కానేకాదు.

ఇక, ఓటుకు నోటు కేసంటారా అది ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యల ఖర్మ. వారికి శ్రీకృష్ణ జన్మస్ధానం రాసిపెట్టి ఉంది కాబట్టి కొద్ది రోజులు జైలు పాలయ్యారు. టిడిపికి అనుకూలంగా ఓటు వేయటానికి కుదుర్చుకున్న రూ. 5 కోట్ల బేరంలో రూ. 50 లక్షలు తీసుకోవటంలో ఎంఎల్ఏ స్టీఫెన్ సన్ తప్పేమీ లేదు.

ఓటు వేయటానికి ఎంఎల్ఏ డబ్బు తీసుకోవటం తప్పు కానేకాదని స్వయంగా న్యాయస్ధానమే తేల్చి చెప్పేసిన తర్వాత ఇందులో నైతికతకు అవకాశమే లేదు. మరి, రేవంత్, సండ్రలపై కేసు ఎందుకంటారా? ముందే చెప్పుకున్నట్లు వారి ఖర్మ ఫలితం.

ఇక, అమరావతి డిజైన్ల ఎంపిక ప్రక్రియలో అవినీతి, పోలవరం నిర్మాణంలో అవినీతి, పట్టిసీమ, పుష్కరాల నిర్వహణలో అవినీతి. ఇలా.. చంద్రబాబు పాలన మొత్తం అవినీతి మయం అనేది కేవలం ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలే తప్ప అందులో వాస్తవం ఏమీ ఉండబోదు.

చంద్రబాబుపైన ఉన్నఆరోపణల్లో ఇంత వరకూ ఒక్క అంశం కూడా న్యాయస్ధానంలో నిరూపణ కాలేదు. ఇపుడు చెప్పండి నైతిక విలువల గురించి చెప్పటానికి చంద్రబాబుకన్నా అర్హత ఉన్నవారు ఎవరున్నారో?