తెలంగాణాలో కూడా కెసిఆర్ ప్రతిపక్షాల విషయంలో అదే రీతిలో వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో అసెంబ్లీలో, బయట ప్రతిపక్షాలకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నారు.

తెలంగాణా సమస్యలపై కెసిఆర్ ప్రతిపక్షాలతో వ్యవహరిస్తున్న తీరుకు ఏపిలో చంద్రబాబు తీరుకు చాలా తేడా కనబడుతోంది. ఈనెల 6వ తేదీన ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రధానితో సమావేశమవుతున్నారు కెసిఆర్. అందుకు 5వ తేదీకల్లా ప్రతిపక్షాలను ఢిల్లీకి రావాల్సిందిగా సిఎం ఆహ్వానాలు పంపారు. అంటే, తెలంగాణాలో కెసిఆర్ ప్రొటోకాల్ పాటిస్తున్నారు. కాబట్టే కెసిఆర్ వివిధ సమస్యలపై ప్రతిపక్షాలతో నిరంతరం చర్చిస్తున్నారు. ప్రతిపక్షాలిచ్చే సలహాలు తీసుకుంటారా అన్నది వేరే విషయం. తమ ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరిస్తోందనే జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మరి అదే సమయంలో 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు ఏమైంది? కష్టాల్లో ఉన్నామని, కట్టుబట్టలతో తరిమేసారని చంద్రబాబు తరచూ చెప్పుకుంటున్నదే. మరి అటువంటి పరిస్ధితుల్లో చంద్రబాబు ఇంకా ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి. పైగా చెప్పుకోవటానికి ప్రతిపక్షాలు కూడా ఎక్కువ లేవు. అసెంబ్లీలో అయితే, వైసీపీ తప్ప ఇంకో పార్టీయే లేదు. ఇక, బయటంటారా వామపక్షాలు, కాంగ్రెస్ తప్ప మూడో పార్టీనే లేదు. కానీ ఏ రోజూ చంద్రబాబు హుందాగా ప్రవర్తించిన దాఖలాల్లేవు.

రాజధాని శంకుస్ధాపన వ్యవహారం కావచ్చు, అసెంబ్లీ సమావేశాలు కావచ్చు. ప్రతీ విషయంలోనూ ప్రతిపక్ష నేతను లక్ష్యంగా చేసుకునే చంద్రబాబు రాజకీయాలు నడుపుతున్నారు. రాజకీయాలు వేరు ప్రభుత్వ వ్యవహారాలు వేరు అన్న విషయం చంద్రబాబు పూర్తిగా పక్కన పడేసారు. ప్రతిపక్ష నేతను చంద్రబాబు ఎందుకో ఆగర్భ శతృవుగా చూస్తున్నారు. వైసీపీ పొడ అంటేనే గిట్టటం లేదు. అందుకనే అసెంబ్లీలో వైసీపీనే లేకుండా చేయాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నట్లే కనబడుతోంది. అందుకనే ఫిరాయింపులకు పాల్పడుతున్నారు.

తెలంగాణాలో కూడా కెసిఆర్ ప్రతిపక్షాల విషయంలో అదే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఫిరాయింపుల్లో భాగంగా టిడిపినీ చీల్చి చెండాడుతున్నారు. కాంగ్రెస్, వామపక్షాలు, వైసీపీ అన్నింటినీ తన దారిలోకి తెచ్చుకుంటున్నారు. అదే సమయంలో అసెంబ్లీలో, బయట ప్రతిపక్షాలకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నారు. వివిధ అంశాలపై ఇప్పటికే చాలాసార్లు అఖిలపక్ష సమావేశాలు కూడా నిర్వహించారు. చంద్రబాబు మాత్రం ఏ విషయంలోనూ అఖిలపక్ష సమావేశాలే అవసరం లేదని చెబుతున్నారు. రాష్ట్రంలో సమస్యల పరిష్కారమైనా, రాజధాని శంకుస్ధాపన కార్యక్రమమైనా ఒకే పద్దతి. ప్రతిపక్ష నేతకు అందుతున్న ఆహ్వానాలు కూడా అందరికీ అందిన తర్వాతనే అందుతున్నది. ప్రొటోకాల్ ప్రకారం తన తర్వాత ప్రతిపక్ష నేతే అన్న మర్యాదను కూడా చంద్రబాబు పాటించటం లేదు. కాబట్టే ఏపిలో అధికార పక్షానికి, ప్రతిపక్షాలకు ఉప్పు-నిప్పులాగ తయారైంది.