రెండు పార్టీలు కూడా ప్రత్యర్ధి ఓట్లలో చీలక తేవాలని అనుకోవటంతోనే ఎన్నికలు రసవత్తరంగా జరగబోతోంది.

శాసనమండలి ఎన్నికలు అధికార, ప్రతిపక్ష నేతలకు సవాలుగా తయారైంది. స్ధానిక సంస్ధల కోటా, ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో ఒకరి బలాన్ని మరొకరు చిత్తు చేయాలని ఎత్తుకుపైఎత్తు వేస్తున్నారు. సంఖ్యాపరంగా స్ధానికసంస్ధల్లో కొన్ని జిల్లాల్లో అధికార పార్టీకి, మరికొన్ని జిల్లాల్లో వైసీపీకి ఆధిపత్యం ఉంది. అయితే, రెండు పార్టీలు కూడా ప్రత్యర్ధి ఓట్లలో చీలక తేవాలని అనుకోవటంతోనే ఎన్నికలు రసవత్తరంగా జరగబోతోంది. ఇటువంటి ఎన్నికల్లో సహజంగానే పండిపోయిన చంద్రబాబునాయుడును వైసీపీ ఎదుర్కునే దానిపైనే జగన్ భవిష్యత్ రాజకీయం ఆధారపడివుంది.

ఉదాహరణకు స్ధానిక సంస్ధల కోటా ఎంఎల్సీ ఎన్నికనే తీసుకుంటే పశ్చిమగోదావరి జిల్లాలో టిడిపి బలం ఎక్కువ. అయితే, ఇక్కడ వైసీపీ కూడా అభ్యర్ధిని నిలిపే అవకాశాలున్నాయి. ఎందుకంటే, టిడిపి ఓట్లలో చీలక వస్తుందని అనుకుంలోంది. ఇక, కర్నూలు, కడప జిల్లాల్లో వైసీపీకి బలముంది. కానీ టిడిపి అభ్యర్ధిని దింపుతోంది. కారణం వైసీపీ ఓట్లలో చీలిక తెచ్చి లబ్దిపొందాలనే. ఇదే పద్దతిలో మరిన్ని జిల్లాల్లో రెండు పార్టీలూ ఒకే విధంగా యోచిస్తున్నాయి. కాబట్టి ఫలితాలు రంజుగా ఉండబోతున్నాయి.

ఇక, అసలైన రాజకీయం ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికల్లోనే ఉండబోతోంది. శాసనసభలో మొత్తం ఎంఎల్ఏల సంఖ్య నామినేటెడ్ ఎంఎల్ఏతో కలుపుకుని 176. ఒక్కో ఎంఎల్సీకి కనీసం 23 ఓట్లు రావాలి. లెక్క ప్రకారమైతే 46 మంది ఎంఎల్ఏల బలమున్న వైసీపీ 2 ఎంఎల్సీలు గెలుచుకుంటుంది. అదేవిధంగా టిడిపి 130 ఎంఎల్ఏల బలంతో 5 సీట్లు గెలుచుకుంటుంది. ఇంకా 15 ఓట్లు మిగిలిపోతుంది.

ఇక్కడే అసలైన రాజకీయానికి టిడిపి తెరలేపుతోంది. 5 సీట్లలో గెలిచిన తర్వాత ఇంకా 15 ఓట్లు అదనంగా ఉంటుంది కాబట్టే 6 సీటుకు పోటీ పెట్టే ఆలోచన చేస్తోంది. అంటే, టిడిపి 6వ సీటు గెలుచుకోవాలంటే అవసరమైన 8 ఓట్లను వైసీపీ నుండే లాక్కోవాలి. ఎలా లాక్కోవాలా అని టిడిపి, తమ ఓట్లను ఎలా కాపాడుకోవాలా అని వైసీపీ వ్యూహరచనలు మొదలుపెట్టినట్లు సమాచారం. అదే సందర్భంలో తమ ఓట్లను కాపాడుకుంటూనే వీలైనంతలో టిడిపి నుండి ఒక్క ఓటునైనా అదనంగా తెచ్చుకోవాలని వైసీపీ యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫిరాయింపు ఎంఎల్ఏల్లో కొందరు, టిడిపి ఎంఎల్ఏల్ల కొందరు చంద్రబాబుపై గుర్రుగా ఉన్నారనే ప్రచారం ఆధారంగానే వైసీపీ వ్యూహాలకు పదునుపెడుతున్నట్లు సమాచారం. కాబట్టి ఎవరి బలాన్ని ఎవరు బద్దలు కొడతారో చూడాలంటే కొంత కాలం ఆగాల్సిందే.