చంద్రబాబును అర్ధం చేసుకోవటం కాదు. అర్ధం చేసుకోవాలని ప్రయత్నించటం కూడా వృధానే.
చంద్రబాబునాయుడు రాజనీతిని ప్రతిపక్షాలతో పాటు ప్రజలూ అర్ధం చేసుకోలేకపోతున్నారని పాపం ప్రత్తిపాటి పుల్లారావు వాపోయారు. చంద్రబాబు ఆలోచనను అర్ధం చేసుకోవటం ఎవరికైనా సాధ్యమా? పిల్లనిచ్చిన ఎన్టిఆర్ కే సాధ్యం కాలేదు చంద్రబాబు రాజనీతి. చంద్రబాబు హామీతోనే వైసీపీ నుండి టిడిపిలోకి ఫిరాయించిన భూమా నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రూ లాంటి వాళ్ళకీ అర్ధం కాలేదు. పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి టిడిపిలోకి చేరిన గంగుల ప్రభాకర్ రెడ్డి లాంటి వారూ అర్ధం చేసుకోలేకపోయారు.
నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ నుండి టిడిపిలో చేరిన ఆనం బ్రదర్స్ కూడా అదే మాట అంటున్నారు కదా? విశాఖపట్నం జిల్లాలో మంత్రులు గంటా శ్రీనివాస్ రావు, చింతకాయల అయ్యన్నపాత్రుడూ అర్ధం చేసుకోలేకపోతున్నారు. అందుకనే గొడవలు పెడుతున్నారు. ఇక, అనంతపురం జిల్లాలో జెసి బ్రదర్స్ తో పాటు చాలా మంది తమ్ముళ్లూ అదే అయోమయంలో ఉన్నారు. పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానైన హైదరాబాద్ నుండి కదిలేదే లేదంటూ చెప్పిన కొద్ది రోజులకే తట్టా, బుట్టా సర్దుకుని వెలగపూడికి వెళ్లిపోయిన కారణాలూ ఎవరికీ అర్ధం కావటం లేదు.
మంత్రివర్గంలో ఎవరిని తీసుకుంటారో తెలీదు. ఎవరిని తొలగిస్తారో తెలీక అయోయంలో కొట్టుకుంటున్నారు. ఇక, ఎన్నికల హామీల అమలు ఏ మేరకు జరిగిందో కూడా ఎవరికీ అర్ధం కావటం లేదు. చంద్రబాబు రాజనీతిని అర్ధం చేసుకోలేక మంత్రులు, ఎంఎల్ఏలే అవస్తలు పడుతున్నారు. మహిళా పార్లమెంటేరియన్ సదస్సుకు రమ్మంటూ ఆహ్వానాలు పంపి రాగానే అరెస్టులు చేస్తారని ఎంఎల్ఏ రోజా కూడా అర్ధం చేసుకోలేకే ఎగేసుకుని వచ్చి భంగపడ్డారు. చంద్రబాబును అర్ధం చేసుకోవటం కాదు. అర్ధం చేసుకోవాలని ప్రయత్నించటం కూడా వృధానే. ఎందుకంటే, ఎవరి ఆలోచనలకూ అందని రాజనీతిజ్ఞుడు చంద్రబాబునాయుడు.
