విజయవాడ: తెలుగుదేశం పార్టీలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటు లొల్లి మెుదలైంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి తన కుమార్తె షబానా ఖాతూర్ పోటీ చేస్తుందని టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ స్పష్టం చేశారు. మంగళవారం షబానా ఖాతూర్ చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 

అనంతరం మీడియాతో మాట్లాడిన జలీల్ ఖాన్ వచ్చే ఎన్నికల్లో తన కుమార్తె షబానా ఖాతూర్ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. విజయవాడ పశ్చిమ టీడీపీ అభ్యర్థిగా షబానా పేరును చంద్రబాబు ఖారారు చేసినట్లు చెప్పుకొచ్చారు. విజయవాడ పశ్చిమ స్థానాన్ని చంద్రబాబుకు కానుకగా ఇస్తామని జలీల్‌ఖాన్‌ ధీమా వ్యక్తం చేశారు. 

తాను రాజకీయాల నుంచి రిటైర్‌ కాలేదని తెలిపారు. షబానా ఖాతూర్ సైతం తాను త్వరలో విజయవాడ పశ్చిమలో ప్రచారం ప్రారంభిస్తానని చెప్పారు. అయితే జలీల్‌ఖాన్‌ కుమార్తెను చంద్రబాబు ప్రకటించలేదని ఏపీ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ నాగుల్‌ మీరా చెప్తున్నారు. 

జలీల్‌ఖానే తనకు తానుగా అభ్యర్థిని ప్రకటించారని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో తమ వర్గీయులు ఎక్కువ మంది ఉన్నారని అలాంటిది ఆమెకు ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. తమను సంప్రదించకుండా చంద్రబాబు అభ్యర్థిని ప్రకటిస్తారని తాము అనుకోవడం లేదని వెల్లడించారు. ఈ అంశంపై గురువారం తమ వర్గీయులతో కలిసి చంద్రబాబును కలవబోతున్నామని నాగూల్ మీరా స్పష్టం చేశారు.

 ఈ వార్తలు కూడా చదవండి

రాజకీయాల్లోకి జలీల్ ఖాన్ కుమార్తె.. టికెట్ ఖరారు