టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె షబానా  ఖాతూర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మంగళవారం ఆమె తండ్రి జలీల్ ఖాన్ ఆధ్వర్యంలో చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా.. ఆమెకు టీడీపీ నుంచి టికెట్ ఖరారు అయ్యిందని జలీల్ ఖాన్ చెబుతున్నారు.

ఈ సందర్భంగా జలీల్‌ఖాన్ మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ టీడీపీ అభ్యర్థిగా షబానా పేరును చంద్రబాబు ఖారారు చేసినట్లు తెలిపారు. పశ్చిమ స్థానాన్ని చంద్రబాబుకు కానుకగా ఇస్తామని జలీల్‌ఖాన్‌ అన్నారు. తాను రాజకీయాల నుంచి రిటైర్‌ కాలేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.  తాను పార్టీ కోసం కృషి చేస్తానని చెప్పారు. అవసరమైతే గుంటూరు జిల్లాలో కన్నాపై పోటీచేస్తానని తెలిపారు.
 
షబానా మాట్లాడుతూ...మొదటి నుంచి తాను సీఎం అభిమానినని, అమెరికాలోని వర్జీనియాలో టీడీపీ కోఆర్డినేటర్‌గా ఉన్నానని తెలిపారు. అమెరికా నుంచి తమ కుటుంబం ఏపీకి వచ్చేసిందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి తన వంతు సాయం చేస్తానని స్పష్టం చేశారు. త్వరలో విజయవాడ పశ్చిమలో ప్రచారం ప్రారంభిస్తానని షబానా ఖాతూర్‌ చెప్పారు.