రాష్ట్రంలో మైనార్టీలైన నూర్‌ బాషా, దూదేకులకు రాజకీయంగా అన్యాయం జరుగుతోందని రాష్ట్ర పోలీస్‌ హౌజింగ్‌ బోర్డు చైర్మన్‌, టీడీపీ నేత నాగుల్‌ మీరా సంచలన వ్యాఖ్యలు చేశారు. 

విజయవాడ: రాష్ట్రంలో మైనార్టీలైన నూర్‌ బాషా, దూదేకులకు రాజకీయంగా అన్యాయం జరుగుతోందని రాష్ట్ర పోలీస్‌ హౌజింగ్‌ బోర్డు చైర్మన్‌, టీడీపీ నేత నాగుల్‌ మీరా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ కూడా నూర్‌ బాషాలకు చట్టసభల్లో సరైన ప్రాతినిథ్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. 

ప్రస్తుతం పార్టీలో ముస్లింలకే అన్ని పదవులూ ఇస్తున్నారని ఆయన సోమవారం విమర్శించారు. ముస్లింలలో 20 లక్షల మేర నూర్‌ బాషాలు ఉన్నారని, అందువల్ల తమ ప్రాధాన్యత గమనించి, వివిధ పదవుల్లో తమకు వాటా ఇవ్వాలని ఆయన అన్నారు.

ఇదిలావుంటే, ఎన్నికలు సమీపిస్తున్న వేళ విజయవాడ టీడీపీలో టికెట్ల లొల్లి రాజుకుంటోంది. వైఎస్సార్‌ సీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ కూతురు షబానాకు చంద్రబాబు విజయవాడ పశ్చిమ టికెట్‌ కేటాయించినట్లు తెలుస్తోంది. 

అయితే ఈ స్థానంపై నాగుల్ మీరా ఆశలు పెట్టుకున్నారు. సీనియర్ నైన తనకు కాకుండా ఇతరులకు సీటు కేటాయించడంపై ఆయన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వేరే పార్టీ నుంచి వచ్చినవారికి సీటు కేటాయించడంపై ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. జలీల్‌ ఖాన్‌తో పాటు ఆయన కూతురు షబానా కూడా వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.