ఏపీలో జరుగుతున్న పలు అభివృద్ది పనులకు సహకారం అందించాలని వైసిపి ఎమ్మెల్యే రోజా తమిళనాడు సీఎం స్టాలిన్ ను కోరారు.
చెన్నై: చిత్తూరు జిల్లాలోని నగరి (nagari) నియోజకవర్గం తమిళనాడు సరిహద్దులో వుండటంతో ఇక్కడ తమిళ ప్రజలు కూడా అధికంగా వుంటారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు తమిళ మీడియం కూడా చదువుతుంటారు. ఇలా ఆంధ్రప్రదేశ్ లో ఉండి తమిళ మీడియంలో చదువుతున్న విద్యార్థులకు తమిళ పాఠ్యపుస్తకాలను (మెట్రిక్యులేషన్ సిలబస్) అందించాలని వైసిపి ఎమ్మెల్యే రోజా (roja) తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ (stalin) ను కోరారు. ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఒక్కో తరగతికి 1000 చొప్పున మంజూరు చేయాలని రోజా కోరారు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను ఇవాళ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, ఆమే భర్త ఆర్కె సెల్వమణి (rk selvamani) కలిసారు. చెన్నైలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎంను కలిసిన రోజా నగరి నియోజకవర్గమునకు సంబంధించిన సమస్యలతో పాటు ఏపీలో నివసిస్తున్న తమిళుల సమస్యలను విన్నవించారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
Video
''ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా సుమారు ఐదువేల ఎనిమిది వందల ఎకరాల విస్తీర్ణంలో చేపడుతున్న కొసలనగరం పారిశ్రామిక పార్క్ కు అభివృద్దికి సహకారం అందించాలని తమిళ సీఎంను రోజా కోరారు.ముఖ్యంగా తమిళనాడు నుంచి పరిశ్రమలు రావడానికి, భారీ వాహనాల ట్రాన్స్పోర్టేషన్ కు అనువుగా నేడుంబరం-అరక్కోణం రోడ్డు (NH 716) నుంచి ఇండస్ట్రియల్ పార్కు చేరడానికి అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి రోజా అనుమతులు కోరారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను సీఎం స్టాలిన్ కు అందించారు.
ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాలలో హ్యాండ్లూమ్, పవర్లూమ్ కార్మికులు ఒక కోటికి పైగా ఉన్నారని తమిళనాడు సీఎం దృష్టికి రోజా తీసుకువెళ్లారు. కాబట్టి ప్రపంచ టెక్స్ టైల్ అవసరాలను మన దక్షిణ భారత దేశ చేనేత మరమగ్గాల కార్మికులు తీర్చడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ తో ఈ విషయంలో ఇదివరకే చర్చించినట్లు... మీరు కూడా దీని గురించి ఆలోచించి తగు చర్యలు తీసుకోవాలని స్టాలిన్ ను రోజా కోరారు.
ఇక ఆంధ్ర రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో నివాసముంటున్న తమిళ కుటుంబీకులు చెన్నై మహానగరంతోనూ, తమిళనాడులోని ప్రధాన పట్టణాల్లోనూ బంధుత్వపరంగా, వ్యాపారపరంగా చాలా ఎక్కువ లావాదేవీలు కలిగి ఉన్నారని తెలిపారు. అటువంటి వారికి తమిళనాడులో సాధారణ పౌరుడికి ఉన్న సౌకర్యాలు అన్నింటిని కూడా వర్తింపజేయాలని రోజా తమిళనాడు సీఎంకు విన్నవించారు.
ప్రజలకు ఉపయోగపడే ప్రతిపాదనలను ఎప్పటికీ స్వాగతిస్తామని... వీటిని పరిశీలించి తగు చర్యలు తొందరగా తీసుకుంటామని ముఖ్యమంత్రి స్టాలిన్ ఎమ్మెల్యే ఆర్కే రోజా, రాయలసీమ వీవర్స్ యూనియన్ ప్రెసిడెంట్ సెల్వమణికి హామీ ఇచ్చారు.
