ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థులు చేసిన ఖర్చును తాజాగా అధికారులు లెక్కించారు.  పశ్చిమగోదావరి జిల్లాలోని రెండు పార్లమెంట్, 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు చూపిన లెక్కల ఆధారంగా ఎన్నికల వ్యవ పరిశీలకులు తాజాగా తుది నివేదిక సమర్పించారు. జిల్లా వ్యాప్తంగా ఈ  ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేనలు రూ.9కోట్ల 16లక్షల 80వేల 610 రూపాయలు ఖర్చు చేసినట్లు తేలింది.

ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు రూ. 28 లక్షలు, పార్లమెంటు స్థానానికి పోటీ చేసే అభ్యర్థి రూ.70 లక్షలకు మించి ఖర్చు చేయకూడదని ఎన్నికల సంఘం మార్గదర్శ కాలను జారీ చేసింది. కానీ.. అనధికారికంగా అభ్యర్థులు కోట్లలో ఖర్చు చేసినట్లు ప్రచారం సాగింది. అయినప్పటికీ ఎన్నికల సంఘానికి చూపిన లెక్కల్లో ఎక్కడా హద్దులు దాటలేదు.

ఈ ఎన్నికల్లో జనసేన ఎంపీ అభ్యర్థిగా మెగా బ్రదర్ నాగబాబు పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఆయనకు విజయం మాత్రం దక్కలేదు. అయితే... ఈ ఎన్నికల్లో నాగబాబు రూ.48లక్షలు ఖర్చు చేసినట్లు తేలింది. జిల్లాలోని రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో మూడు పార్టీలు రెండు కోట్ల 31 లక్షల ఐదు వేల 368 రూపాయలు ఖర్చుచేశాయి. ఈ ఖర్చులో నరసాపురం నియోజకవర్గంలో అభ్యర్థులు ఎక్కువ ఖర్చు చేశారు.