హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు 2014 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎందుకు మద్దతు ఇచ్చారో ఆయన సోదరుడు, సినీ నటుడు నాగబాబు చెప్పారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుభవం ఉన్న నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో పవన్ చంద్రబాబుకు, ఆయన పార్టీకి మద్దతు ఇచ్చారని నాగబాబు స్పష్టం చేశారు. 

కొత్త రాష్ట్రం కాబట్టి అప్పట్లో సీనియర్‌ నాయకుడైతే సమర్థంగా నడపగలరనే ఉద్దేశంతో చంద్రబాబుకు పవన్‌ మద్దతు తెలిపినట్లు నాగబాబు చెప్పారు. ఆ సమయానికి పవన్ కల్యాన్ కు కనిపించిన క్లీన్‌ పర్సన్‌ చంద్రబాబు అని ఆయన అన్నారు. అలా అని చంద్రబాబు ఆరోపణలు లేవని కాదని సర్దిచెప్పారు. 

అప్పటికే వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని, దీంతో టీడీపిని గెలిపించాలని పవన్ ప్రజలను కోరిటన్లు ఆయన తెలిపారు. అలా చేసినందుకు చాలామంది రకరకాలుగా మాట్లాడారని అన్నారు. డబ్బులు తీసుకున్నారని, ప్యాకేజీ మాట్లాడుకున్నారని ‘సి’ గ్రేడ్‌ కామెంట్లు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

అలాంటి వ్యాఖ్యలను తాము ఏ మాత్రం పట్టించుకోలేదని చెప్పారు. మనం తప్పు చేయనప్పుడు ఈ సమాజం అంతా చెడ్డవాడు అన్నా సరే నిలబడాలని, మన అంతర్మాతకు నిజం తెలుసునని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ అంతర్మాతకు భయపడతారు గానీ, ఇలాంటి పిచ్చి కామెంట్లకు భయపడరని అన్నారు. 

వైసిపి వాళ్లు కూడా తమ ఎన్నికల వ్యూహంలో భాగంగా పవన్ కల్యాణ్ పై చాలా వ్యాఖ్యలు చేశారని, ఎప్పుడైతే ఆయన బలమైన వ్యక్తిగా మారుతున్నారని తెలిశారో అప్పటి నుంచి మళ్లీ టీడీపి, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయని అన్నారని ఆయన వివరించారు. ఆ వ్యాఖ్యలను తిప్పి కొట్టాలని తాము చాలా ప్రయత్నించామని,  మీడియా మద్దతు కూడా వాళ్లకే ఉందని అన్నారు. టీడీపి వాళ్లు కూడా తమకు లాభిస్తుందని మాట్లాడకుండా ఉండిపోయారని అన్నారు.