విజయవాడ: ప్రజల ఆరోగ్యం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డికి ఏ మాత్రం బాధ్యత లేదని అర్థం అవుతోందని జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకు కోవిడ్ కేసులు పెరుగుతూ ఉంటే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయకపోవడమే ప్రభుత్వ మూర్ఖత్వానికి పరాకాష్ట అన్నారు. విద్యావేత్తలు, ఉపాధ్యాయ వర్గాలు, విద్యార్థుల తల్లితండ్రులు కోరుతుంటే జగన్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తోందని నాదెండ్ల మండిపడ్డారు. 

''ఉపాధ్యాయులను కోవిడ్ కేంద్రాల్లో విధులకు పంపించే అర్థం లేని చర్యకు జగన్ రెడ్డి సొంత జిల్లా కడపలోనే శ్రీకారం చుట్టారు. విద్యార్థుల యోగక్షేమాలను ఏ మాత్రం పట్టించుకోకుండా ఉపాధ్యాయులను కోవిడ్ కేంద్రాలకు పంపించడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. పదో తరగతి విద్యార్థులకు ఇప్పటికీ తరగతులు నడుపుతున్నారు. ప్రతి విద్యార్థికి మూడు మాస్కులు ఇచ్చి, షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పదేపదే చెబుతున్నారు. ఆయన మాటలు వింటుంటే ఈ ప్రభుత్వానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబాల ఆరోగ్యక్షేమాల గురించి పట్టింపు లేదని అర్థం అవుతోంది'' అన్నారు. 

read more  పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలి.. గవర్నర్ కు నారా లోకేష్‌ లేఖ...

''విద్యార్థుల తల్లితండ్రులు భయంతో ఉన్న తరుణంలో ఉపాధ్యాయులను కోవిడ్ కేంద్రాల్లో డ్యూటీకి పంపించడం ఏమిటి? ఆ ఉపాధ్యాయులే పదో తరగతి పిల్లలకు పాఠాలు చెప్పాలి.... తదుపరి పరీక్షలు నిర్వహించాలి. అంటే విద్యార్థులను కరోనా ముంగిట నిలిపే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వమే కల్పిస్తోంది'' అంటూ నాదెండ్ల ఆందోళన వ్యక్తం చేశారు. 

''పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు సుమారు 16.5 లక్షల మంది విద్యార్థులు వెళ్లాల్సి ఉంది. పాఠాలు చెప్పేవారిని కోవిడ్ కేంద్రాల దగ్గర ఉద్యోగం చేయమని, ఆ తరవాత పిల్లలకు పరీక్షలుపెట్టమంటే అది అన్ని లక్షల మంది పిల్లలను, వారి కుటుంబాలను ముప్పులోకి నెట్టడమే అవుతుంది'' అన్నారు. 

''ప్రభుత్వం పంతాలు పట్టింపులకు పోకుండా పదో తరగతి, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలను తక్షణమే రద్దు చేయాలి. సిబిఎస్ఈ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల తరహాలోనే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడవద్దు. ఉపాధ్యాయులను కోవిడ్ కేంద్రాల దగ్గర విధులను నుంచి ఉపసంహరించుకోవాలి'' అని నాదెండ్ల ప్రభుత్వాన్ని సూచించారు.