జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఏపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆర్థిక మూలాల  మీద ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు.  

జనసేన మత్స్యకార విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన మత్య్యకార యాత్ర కొనసాగుతుంది. ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురంలో జనసేన నేతలు పాదయాత్ర నిర్వహించారు. ఇందులో భాగంగా జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar).. మత్స్యకార గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ ఏపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆర్థిక మూలాల మీద ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. పవన్ కల్యాణ్‌ను ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మత్స్యకారుల కష్టాలు గాలికొదిలేశారని జనసేన పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మత్స్యకార్ల కడుపు కొట్టే విధంగా ప్రభుత్వం చేపలు అమ్ముకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. జీవో 217తో నాలుగున్నర లక్షల మంది మత్స్యకారుల ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారుల సర్వతోముఖాభివృద్ధి జనసేన లక్ష్యమని ఇటీవల నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. సముద్రంలో వేటకు వెళ్లి దురదృష్టవశాత్తు మృతిచెందిన వ్యక్తి కుటుంబానికి రూ. 10 లక్షలు అందజేస్తామని ఎన్నికల ముందు వైఎస్ జగన్ హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. అధికారంలో వచ్చి రెండున్నరేళ్లు గడిచిన ఇప్పటివరకు 64 కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిమారం మాత్రమే అందించారని చెప్పారు.

ఇక, ఈ నెల 20వ తేదీన నరసాపురంలో జనసేన బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ హాజరుకానుండగా.. మత్స్యకారులు వారి సమస్యలను జనసేనానికి నివేదించనున్నారు. ఈ క్రమంలోనే నేడు, రేపు నాదెండ్ల మనోహర్‌ తీర ప్రాంతాల్లో పర్యటించి మత్స్యకారులతో సమా వేశం కానున్నారు. ఈ సమస్యలన్నింటిని అజెండాగా చేసి ఈ నెల 20న నరసాపురంలో జరిగే సభలో పవన్‌ ప్రస్తావిస్తారన్నారు.