గుంటూరు: జనసేన నేత పవన్ కల్యాణ్ తో కాంగ్రెసు నేత, శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఈ సమావేశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

పవన్ కల్యాణ్ తో దాదాపు అరగంట మనోహర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వివిధ అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.  రాష్ట్ర విభజన తర్వాత నాదెండ్ల మనోహర్ రాజకీయాలకు కాస్తా దూరంగా ఉంటూ వస్తున్నారు. 

ఇటీవల ఆంధ్రప్రదేశ్ సీనియర్ నాయకులు ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమై పార్టీని బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలపై చర్చించారు. ఈ సమావేశంలో నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.

నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరడానికే ఆ భేటీ జరిగిందా అనే విషయంపై స్పష్టత లేదు. జనసేనతో కలిసి కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వ్యూహరచన ఏదైనా చేస్తుందా అనేది కూడా చెప్పలేని వాతావరణం నెలకొంది. పవన్ కల్యాణ్ అన్నయ్య చిరంజీవి ఇప్పటికీ కాంగ్రెసులోనే ఉన్నారు. చిరంజీవి పార్టీ మారే ఆలోచనలో కూడా లేరని తెలుస్తోంది. 
అయితే, చిరంజీవి మాత్రం కాంగ్రెసు కార్యకలాపాలకు దూరంగానే ఉంటూ సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నారు. రాజకీయాలు ఎటైనా మలుపు తిరిగే అవకాశాలు లేకపోలేదు.