విజయవాడ: విశాఖలో హిందుస్తాన్ షిప్ యాడ్ దుర్ఘటనలో మృతులకు సంతాపంతో జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ టెలీ కాన్ఫరెన్స్ ప్రారంభమయ్యింది. అలాగే రాజధాని వికేంద్రీకరణ, అమరావతి నుంచి రాజధాని తరలింపు, భూములు ఇచ్చిన రైతుల ఆందోళనపై ప్రధానంగా చర్చ జరిగింది. పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కె.నాగబాబు, తోట చంద్ర శేఖర్, పి.ఏ.సి. సభ్యులు ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. 

అనంతరం ఆ పార్టీ పి.ఏ.సి. ఛైర్మన్  నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ  “రాజధాని తరలింపు అనేది ప్రభుత్వ నిర్ణయం కాదు. ఇది ప్రభుత్వ అజెండా ప్రకారం చేసింది కాదు...కేవలం వ్యక్తిగత అజెండా మేరకు తీసుకున్న నిర్ణయం. ఒక వ్యక్తి ఆలోచనల మేరకు... ఆ వ్యక్తిగత శతృత్వం, వ్యక్తిగత విభేదాలతో అమరావతి నుంచి రాజధాని తరలింపుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంలో మంత్రులకు కూడా రాజధానికి సంబంధించిన నిర్ణయాలు తెలియవు. రాజధాని ప్రాంత ఎమ్మెల్యేలకు ఏం జరుగుతుందో కూడా తెలియదు'' అని అన్నారు. 

read more   పులివెందుల పులకేశీ...తుపాకులతో బెదిరించమేనా మీ రాయలసీమ అభివృద్ది: యనమల ఫైర్

''చంద్రబాబు ఒక తెలివైన సేల్స్ మేన్. మార్కెటింగ్ చేసుకున్నారు. అంతే తప్ప రాజధాని నిర్మాణం విషయంలో బలమైన చట్టం తీసుకోవడంపై శ్రద్ధపెట్ట లేదు. దాని ఫలితమే ఇది. ఆది నుంచి టిడిపి ప్రభుత్వం రాజధాని విషయంలో తప్పటడుగులు వేసి రాజధాని రైతులను నష్టపరిచారు. ప్రభుత్వం రాజధాని నిర్మిస్తుంది అనే ఉద్దేశంతోనే భూములను రైతులు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం మారగానే తరలిస్తున్నారు. అంటే నాడు ప్రభుత్వం రాజధాని తరలించేందుకు ఆస్కారం లేని చట్టం చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం చెందింది'' అని ఆరోపించారు. 

''రాజధాని గ్రామాల్లో భూ కుంభకోణాలు జరిగాయి అని వైసీపీ ప్రభుత్వం చెప్పింది. ఆ కుంభకోణాలు చేసినవారిని విచారించి శిక్షించమని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ చెప్పారు. ఆ పేరుతో రైతులను ఇబ్బందిపెట్ట వద్దు... వారి త్యాగాలను గుర్తించమని చెప్పారు. రాజధాని గ్రామాల్లో పవన్ కల్యాణ్ పర్యటించి అక్కడి నిర్మాణాలు పరిశీలించారు. అలాగే రైతుల ఆందోళనలో పాల్గొన్నారు. మద్దతు తెలిపారు. తొలి నుంచి ఒక రైతులు నష్టపోకూడదు అని చెబుతున్నారు'' అని అన్నారు. 

''రాష్ట్ర విభజన తరవాత అయిదేళ్లపాటు చంద్రబాబు నాయుడు బీద ఏడుపులు ఏడుస్తూ, దీక్షలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని వదిలేశారు. రాజధానిపై పూర్తి దృష్టిపెట్టకుండా సమయం వృథా చేశారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కూడా వికేంద్రీకరణ అంటూ కాలం దొర్లిస్తున్నారు. ఇద్దరికీ రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు. ఇద్దరూ తమ పర్సనల్ అజెండాతోనే పాలన సాగిస్తున్నారు'' అని నాదెండ్ల మండిపడ్డారు.