చెన్నై : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైయస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరు బిల్లులను తమిళనాడుకు చెందిన ప్రముఖ పార్టీ ప్రశంసించింది. 

తమిళనాడులో ప్రముఖ రాజకీయ పార్టీ నామ్ తమిళర్ కట్చి అధినేత సీమాన్ ప్రశంసలతో ముంచెత్తారు. తనపై నమ్మకంతో అధికారం ఇచ్చిన ప్రజల పట్ల చిత్తశుద్ధితో జగన్ పని చేస్తున్నారని కొనియాడారు.  

వేలూరులో ఒక బహిరంగ సభలో ప్రసంగించిన సీమాన్ 75 శాతం స్థానికులకే ఉద్యోగావకాశాలు అమలు చేసి సీఎం జగన్ చరిత్ర సృష్టించారని కొనియాడారు. దేశంలో ఎక్కడాలేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు, వీటిలో 50 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు, వితంతువులకు పింఛన్లు ప్రకటించటం అభినందనీయమన్నారు. 

తనకు అధికారాన్ని ఇచ్చిన ప్రజలకు మంచి చేయాలనే తపన సీఎం జగన్ లో కనిపిస్తోందని తెలిపారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి జగన్ చేపడుతున్న కార్యక్రమాలే అందుకు నిదర్శనమంటూ కొనియాడారు.  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధితోపాటు తెలుగు జాతి సంక్షేమానికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారనడానికి ఆయన అవలంభిస్తున్న విధానాలే ఉదాహరణలు అంటూ చెప్పుకొచ్చారు. ఇకపోతే తమిళనాడులో సీమాన్ తెలుగువారిపై పోరాటం చేస్తుంటారు. అలాంటి సీమాన్ సీఎం వైయస్ జగన్ ను పొగడ్తలతో ముంచెత్తడంపై తమిళ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.