వైసీసీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం టీడీపీ సానుభూతిపరులకు కూడా వాలంటీర్లకు అవకాశం ఇచ్చిందని.. అయితే అందులో కొందరు మారలేదని అన్నారు.
వైసీసీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం టీడీపీ సానుభూతిపరులకు కూడా వాలంటీర్లకు అవకాశం ఇచ్చిందని.. అయితే అందులో కొందరు మారలేదని అన్నారు. అటువంటి వారిని స్థానిక నాయకులు గుర్తించి చెబితే తొలగిస్తామని చెప్పారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గృహసారథులు, సచివాలయ కన్వీనర్లతో నిర్వహించిన సమావేశంలో వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతనంగా నియమితులైన గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు ప్రతి కుటుంబానికి సన్నిహితంగా ఉండాలని సూచించారు.
గత ప్రభుత్వానికి, ఇప్పుడున్న జగనన్న ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్ ప్రభుత్వంలో కుల,మత,వర్గ, వర్ణ, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని తెలిపారు. వైసీపీని ద్వేషించేవారికి కూడా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోని వచ్చిన సమయంలో టీడీపీ సానుభూతిపరులకు కూడా వాలంటీర్లుగా అవకాశం కల్పించామని చెప్పారు. అయితే వారు మారతారేమోనని వేచిచూశామని తెలిపారు. వారిలో కొంతమంది మారారని.. మరికొంతమంది మాత్రం మారలేదన్నారు. అటువంటివారిని స్థానిక నాయకులు గుర్తించి వివరాలు చెబితే వెంటనే వారిని తొలగిస్తామని అన్నారు. తమకు అనుకూలంగా లేని వాలంటీర్లను తొలగిస్తామనే అర్థం వచ్చేలా వసంత కృష్ణప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
