వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యలు.. సజ్జలతో కృష్ణ ప్రసాద్ భేటీ, ఆ మాటలు పట్టించుకోవద్దని వినతి
కమ్మ సామాజిక వర్గం, రాజధాని అమరావతి విషయంలో మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనిపై ఆయన తనయుడు, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయ్యారు.
కమ్మ సామాజిక వర్గానికి జగన్ పాలనలో అన్యాయం జరుగుతోందంటూ మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు తెలుగు రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తనయుడు, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బుధవారం వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం కృష్ణప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. సజ్జలకు అన్ని విషయాలను వివరించినట్లు తెలిపారు. తన తండ్రి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను పరిగణనలోనికి తీసుకోవద్దని కోరినట్లు వివరించారు. తనకు జోగి రమేశ్ వల్ల కలుగుతున్న ఇబ్బందులను సజ్జలకు వివరించినట్లు కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ఆరోగ్యం బాలేక గత కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో వున్నానని ఆయన తెలిపారు.
ఇకపోతే.. కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వన సమారాధన లో వసంత నాగేశ్వరరావు రావు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కమ్మ వర్గానికి అన్యాయం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును ఎవరు అడ్డుకోలేక పోవడం విచారకరమని అన్నారు. రాష్ట్ర కేబినెట్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన మంత్రి వసంత నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. పొరుగున ఉన్న తెలంగాణలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన మంత్రి ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఇతర సామాజిక వర్గాల పల్లకిలను ఇంకెంతకాలం మోస్తారని వసంత నాగేశ్వర రావు ప్రశ్నించారు.
దీనిపై వసంత కృష్ణ ప్రసాద్ స్పందించారు. రాజధాని అమరావతికి మద్దతుగా తన తండ్రి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదని వాటిని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును తన తండ్రి తప్పుపట్టడం తను సమర్థించనని పేర్కొన్నారు. రాజధాని విషయంలో తన వ్యక్తిగత అభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి నిర్ణయమే తనకు శిరోధార్యమని స్పష్టం చేశారు. తన తండ్రి వసంత నాగేశ్వరరావు నోరు చాలా ప్రమాదకరమని, ఎప్పుడూ ఎవరో ఒకరిని ఇరకాటంలో పెట్టడం ఆయన నైజం అని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి జగన్ తోనే తన ప్రయాణం ఉంటుందని స్పష్టం చేశారు. కొందరు కావాలని ఉద్దేశపూర్వకంగా పార్టీలో గందరగోళ వాతావరణం నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి పోటీ చేయమంటే చేస్తా, లేకుంటే పార్టీ కోసం పని చేస్తానని స్పష్టం చేశారు. తాను అవకాశం ఇప్పించిన వారు కూడా తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అన్నారు. జోగి రమేష్ తనకు ఉన్న విభేదాల విషయంలో అధిష్టానంతో చర్చించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ అన్నారు అనారోగ్యంతో ఇటీవల కాలంలో అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న లేదన్నారు. మైలవరంలో అభ్యర్థిని మారిస్తే ఆ అభ్యర్థికి మద్దతుగా తాను నియోజకవర్గంలో పనిచేస్తానని వెల్లడించారు.