నాకు ప్రాణ హని ఉంది: మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంచలనం
తనకు ప్రాణహని ఉందని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు సెక్యూరిటీని కూడా తగ్గించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
నెల్లూరు: తనకు ప్రాణహని ఉందని మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లాలో తన అనుచరులతో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంగళవారం నాడు సమావేశమయ్యారు. తనకు సెక్యూరిటీని కూడ తగ్గించారని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. వేధింపులు, సాధింపులు తనకు కొత్తకాదన్నారు. తనను భూమి మీద లేకుండా చేయాలని చూస్తున్నారని మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండేళ్ల నుండి తన ఫోన్ ను ట్యాపింగ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
తనతో పాటు తన పీఏ ఫోన్ ను కూడా ట్యాప్ చేస్తున్నారని ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. తాను ఇప్పటికీ యాప్ ల ద్వారానే మాట్లాడుతున్నట్టుగా ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. తనకు ఎలాంటి నేర చరిత్ర లేదని ఆయన చెప్పారు. సీబీఐ కేసుల్లో తాను హైద్రాబాద్ చుట్టూ తిరగడం లేదన్నారు. నెల్లూరు జిల్లాలో మాఫియా రాజ్యం ఏలుతుందని తాను వ్యాఖ్యలు చేసిన రోజు నుండి తన ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. తన నియోజకవర్గంలో తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలున్నాయన్నారు. తనకు సెక్యూరిటీని తగ్గించడం సరైందా అని ఆయన ప్రశ్నించారు.
గత కొంతకాలంగా వైసీపీ నాయకత్వంపై మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అసంతృప్తితో ఉన్నారు. బహిరంగంగానే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కూడా ఆనం రామనారాయణ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. ఈ పరిణామాలపై వైసీపీ నాయకత్వం ఆనం రామనారాయణ రెడ్డిపై చర్యలకు తీసుకుంటుంది. నెల్లూరు జిల్లా వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీ బాధ్యతల నుండి ఆనం రామానారాయణ రెడ్డిని వైసీపీ నాయకత్వం తప్పించింది. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కూడా ఆనం రామనారాయణ రెడ్డిని పాల్గొనవద్దని కూడా వైసీపీ నాయకత్వం తేల్చి చెప్పింది. పార్టీ బాధ్యతలను నేదురుమల్లి రాంకుమార్ రెడ్డికి అప్పగించింది