నెల్లూరు: కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడేందుకు ఆనందయ్య తయారు చేసే మందు పంపిణీకి మాగుంట కుటుంబం అన్ని రకాల సహకారాలను అందిస్తుందని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్యని కలిసి సత్కరించడంతో పాటు తన సహకారాన్ని ప్రకటించారు. 

తన మందుతో ప్రపంచ దేశాలకు ఆనందయ్య కీర్తి ప్రతిష్టలు పెరిగి పోయాయని... ప్రస్తుత తరుణంలో ఈ మందు ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఎంతగానో దోహదపడడం ఈ ప్రాంతానికి గర్వకారణం అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందు ఆలోచన చేసి ప్రజల్లో అపోహలు తలెత్తకుండా ఉండేందుకు అన్నిరకాల పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలకు ఈ మందుతో ఎలాంటి ప్రమాదం లేదని తేలినతర్వాతే  రాష్ట్ర ప్రభుత్వం పంపిణీకి అనుమతి ఇచ్చిందన్నారు. మందు పంపీణీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం అభినందనీయమని మాగుంట అన్నారు.

వీడియో

ప్రస్తుతం దేశ విదేశాలలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పేరు మారు మ్రోగుతుందంటే అది ఆనదయ్య మందు ప్రభావంతోనే అని ఆయన అన్నారు. ప్రకాశం జిల్లాలో కూడా ఆనందయ్య మందు పంపిణీ చేసి అక్కడి ప్రజలను కరోనా మహమ్మరి నుండి కాపాడాలన్నారు. ఇదే విషయాన్ని ఆనందయ్యతో చర్చించానని... ఆయన కూడా ఒంగోలులో మందు పంపిణీకి సుముఖత చూపినట్లు ఎంపీ మాగుంట తెలిపారు. 

గతంలో ఆనందయ్యను కలిసేందుకు కృష్ణపట్నంకు వెళ్ళిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఆనందయ్య కట్టుదిట్టమైన పోలీస్ భద్రత మద్య కృష్ణపట్నం పోర్టులో వున్న నేపధ్యంలో అధికార పార్టీ ఎంపీని కూడా కలవనివ్వలేదు. దీంతో అప్పుడు ఆనందయ్యను కలవకుండానే వెనుదిరిగిన మాగుంట తాజాగా ఆయనను కలిసి సత్కరించారు.