Andhra Pradesh Assembly Elections 2024 : లోకేష్ పై ఓ మహిళ పోటీ ... ఎవరీ లావణ్య?
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు, భవిష్యత్ సీఎంగా ప్రచారం జరుగుతున్న నారా లోకేష్ పై వైసిపి ఓ మహిళా అభ్యర్థిని బరిలోకి దింపుతోంది. ఇంతకూ ఆమె ఎవరు? రాజకీయం నేపథ్యం ఏమిటి?
అమరావతి : ఎన్నికల సీజన్ కావడంతో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకి మరింత రసవత్తరంగా మారుతున్నాయి. గెలుపే లక్ష్యంగా అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి-జనసేన కూటమి పక్కా వ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి. వైసిపి అయితే 'వై నాట్ 175', 'వై నాట్ కుప్పం' అంటూ ప్రత్యర్థులను సవాల్ చేస్తోంది. ఇలా టిడిపి చీఫ్ చంద్రబాబును సైతం ఓడిస్తామంటోంది వైసిపి. అంతేకాదు ఆయన తనయుడు నారా లోకేష్ ను మరోసారి ఓడించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇందులో భాగంగానే ఇప్పటికే మంగళగిరి స్థానంపై ప్రయోగాలు చేసిన వైసిపి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. లోకేష్ పై ఓ మహిళను బరిలోకి దించేందుకు వైసిసి అదిష్టానం సిద్దమయ్యింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో లోకేష్ ను ఓడించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్ళీ మంగళగిరి బరిలోకి దిగుతాడని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కేను కాదని గంజి చిరంజీవిని మంగళగిరి వైసిపి ఇంచార్జీగా నియమించారు. కానీ చిరంజీవికి కూడా ఇంచార్జీ పదవి మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలింది. ఆయన ఎమ్మెల్యే ఆశలపై నీళ్లుచల్లుతూ మరో అభ్యర్థికి మంగళగిరి బాధ్యతలు అప్పగించారు వైఎస్ జగన్.
సుధీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబానికి చెందిన మురుగుడు లావణ్యను మంగళగిరి ఇంచార్జీగా నియమించింది వైసిపి. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. టిడిపి అధినేత తనయుడు, భవిష్యత్ ముఖ్యమంత్రిగా పేర్కొంటున్న నారా లోకేష్ పై ఓ మహిళను వైసిపి బరిలోకి దింపుతుండటం రాజకీయ చర్చకు దారితీసింది. సడన్ గా తెరపైకి వచ్చిన ఈ లావణ్య ఎవరో తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఆమె పుట్టింటోళ్లు, అత్తారింటోళ్లు ఇద్దరూ మంగళగిరి రాజకీయాల్లో చక్రం తిప్పినట్లు తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు.
ఇంతకీ ఎవరీ లావణ్య?
మంగళగిరి వైసిపి అభ్యర్థిగా ప్రకటించిన మురుగుడు లావణ్య రాజకీయాలకు కొత్తే కావచ్చు... కానీ ఆమె పుట్టిపెరిగింది, ఇప్పుడు జీవిస్తోంది రాజకీయాల మధ్యనే. లావణ్య తల్లి కాండ్రు కమల గతంలో మంగళగిరి ఎమ్మెల్యేగా పనిచేసారు. అంతేకాదు ఆమె మామ మురుగుడు హనుమంతరావు కూడా మాజీ ఎమ్మెల్యేను. ఇలా పుట్టింటివాళ్ళు, అత్తారింటివాళ్ళు మంగళగిరి రాజకీయాల్లో చక్రం తిప్పినవారే. ఇలా మంగళగిరిపై మంచి పట్టున్న కుటుంబాలకు చెందిన లావణ్య అయితే లోకేష్ ను సమర్ధవంతంగా ఎదుర్కోగలదని వైసిపి అధినేత నమ్మినట్లున్నాడు. అందువల్లే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే, ఇంచార్జీ చిరంజీవిని కాదని ఆమెను లోకేష్ పై బరిలోకి దింపుతున్నారు.
లావణ్య తల్లి కాండ్రు కమల 2009 నుండి 2014 వరకు మంగళగిరి ఎమ్మెల్యేగా కొనసాగారు. ఇక మురుగుడు హనుమంతరావు 2004-2009 వరకు ఎమ్మెల్యేగా పనిచేసారు... ప్రస్తుతం వైసిపి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. వీరిద్దరి కుటుంబాలకు చెందిన లావణ్య ఈసారి మంగళగిరి బరిలోకి దిగుతున్నారు.
నిన్న(శుక్రవారం) ముఖ్యమంత్రి కార్యాలయం నుండి పిలుపు రావడంతో తల్లి కాండ్రు కమల, మామ మురుగుడు హనుమంతరావుతో కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసారు లావణ్య. ఆమెను ఆప్యాయంగా పలకరించిన సీఎం మంగళగిరి ఇంచార్జీ బాధ్యతలు అప్పగిస్తూ గెలిచిరావాలని సూచించారు. ఆ తర్వాత ఆమెతో పాటు మరో ఇద్దరి పేర్లతో వైసిపి 9వ జాబితా వెలువడింది.