కర్ణాటకలో జరిగిందే ఆంధ్రలో: చంద్రబాబుపై మురళీ

Muralidhar Rao blames KCR and Chandrababu
Highlights

కర్ణాటకలో తమ పార్టీని ఓడించడానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసిఆర్, చంద్రబాబు పోటీ కాంగ్రెసుకు ప్రచారం చేశారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మండిపడ్డారు.

హైదరాబాద్‌: కర్ణాటకలో తమ పార్టీని ఓడించడానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసిఆర్, చంద్రబాబు పోటీ కాంగ్రెసుకు ప్రచారం చేశారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మండిపడ్డారు. తెలుగుదేశం, టీఆర్ఎస్ కాంగ్రెసు జేబు పార్టీలని ఆయన వ్యాఖ్యానించారు. 

రక్త సంబంధం అన్నది బీజేపీ డీఎన్‌ఏలోనే లేదని స్పష్టం చేశారు. కుటుంబ రాజకీయాలకు సమాధి కడితేనే గుణాత్మక మార్పు సాధ్యమని ఆయన అన్నారు. నిజాం కూడా కుటుంబ రాజకీయాలు చేశారని, అందుకే మార్పు తీసుకురాలేకపోయారని అన్నారు. 

అధికారంలో లేకపోతే టీఆర్‌ఎస్‌ ఉఫ్‌ అంటే కొట్టుకుపోతుందని అన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ ను ఓడించే శక్తి ఒక్క బీజేపీకి మాత్రమే ఉందని అన్నారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన పార్టీ ఓబీసీ మోర్చా సమావేశంలో ఆయన మాట్లాడారు.
 
కర్ణాటకలో ఏం జరిగిందో ఆంధ్రలో అదే జరగబోతోందని జోస్యం చెప్పారు. అమ్ముడుపోయే నాయకులున్న పార్టీ ప్రజలకు న్యాయం చేయబోదని ఆయన కాంగ్రెసును ఉద్దేశించి అన్నారు. మీడియాను నమ్ముకుంటే కర్ణాటక ఎన్నికల సందర్భంగా రాహుల్‌కు పట్టిన గతే పడుతుందని, అందువల్ల మీడియాను నమ్మవద్దని పార్టీ నాయకులకు అన్నారు. 

loader