తాను నోరు జారి వెంకటేశ్వరస్వామిని వెంకన్న చౌదరిగా పేర్కొన్న సంఘటనపై తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు మురళీమోహన్ వివరణ ఇచ్చారు.

హైదరాబాద్‌: తాను నోరు జారి వెంకటేశ్వరస్వామిని వెంకన్న చౌదరిగా పేర్కొన్న సంఘటనపై తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు మురళీమోహన్ వివరణ ఇచ్చారు. నోరు జారడం సహజంగా జరిగేదేనని, దేవుడితో కూడా ఇదే చెబుకున్నానని ఆయన అన్నారు..

రాజమండ్రిలో ఒక సమావేశంలో పొరపాటున వెంకన్న చౌదరి అన్నట్లు చెబుతూ అప్పటిదాకా బుచ్చయ్య చౌదరి పక్కన కూర్చొని "చౌదరిగారూ.. చౌదరిగారూ.." అని మాట్లాడుకున్నామని చెప్పారు. వెంకన్న చౌదరి అనడం టంగ్‌ స్లిప్పే తప్పదేవుడికి కులాన్ని అంటగట్టేంత తెలివితక్కువ వాడిని కానని వివరణ ఇచ్చుకున్నారు. 
తనకు అసలు కులాల మీద నమ్మకమే ఉండదని, అలాంటిది వెంకటేశ్వరస్వామికి కులం ఎలా అంటగడతానని అన్నారు. టంగ్‌ స్లిప్‌ అనేది సహజంగా జరుగుతూ ఉంటుందని సమర్థించుకున్నారు. 
"టంగ్‌ స్లిప్‌ అయింది స్వామి.. పొరపాటుగా అన్నాను.. కావాలని అనలేదు.." అని దేవుడికి దండం పెట్టుకున్నానని అన్నారు. తాను వెంకన్న చౌదరి అని అనడంపై మురళీమోహన్ వివరణ ఇస్తూ వీడియో పోస్టు చేశారు.