అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన సభ ప్యానల్ స్పీకర్ గా నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ముదునూరి ప్రసాదరాజు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరుణంలో మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు. వైయస్ జగన్ కు అత్యంత సన్నిహితుడు, పార్టీకి విధేయుడుగా ముదునూరి ప్రసాదరావు వ్యవహరించిన నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరిగింది. 

అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆమంత్రి పదవిని కాస్తా ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు తన్నుకుపోయారు. ఈ నేపథ్యంలో ముదునూరి ప్రసాదరాజు బుజ్జగించేందుకు ప్యానల్ స్పీకర్ పదవిని కట్టబెట్టారు.  

స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ లేని సమయంలో ఆయన ప్యానల్‌ స్పీకర్‌గా సభను నడిపించనున్నారు ముదునూరి ప్రసాదరాజు. పశ్చిమగోదావరి జిల్లాకు తొలిసారిగా ఈ పదవి వరించింది. అసెంబ్లీ సమావేశాలు ఎక్కువ రోజులు జరిగే సమయాల్లో స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ సభకు రాలేని నేపథ్యంలో ముదునూరి ఆ బాధ్యతలను చేపట్టాల్సి ఉంటుంది. 

ముదునూరి ప్రసాదరాజుకు ప్యానల్ స్పీకర్ గా అవకాశం రావడంతో నియోజకవర్గ వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముదునూరి ప్రసాదరాజుకు నేరుగా కలిసి అభినందనలు తెలిపారు.