పిల్లనిచ్చిన మామపై చెప్పులేయించావు: బాబుపై ముద్రగడ ఘాటు వ్యాఖ్యలు

Mudragda Padmanabham makes verbal attack on Chnadrababu
Highlights

"నీకు పిల్లనిచ్చి వివాహం చేసిన ఎన్టీ రామారావుపైనే చెప్పులు వేయించావ్‌. ఇప్పుడేమో ఓట్ల కోసం చెప్పులు విడిచి ఆయన విగ్రహానికి ఒంగి ఒంగి దొంగ దండాలు పెడుతున్నావ్" కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడ్డారు.

కాకినాడ: "నీకు పిల్లనిచ్చి వివాహం చేసిన ఎన్టీ రామారావుపైనే చెప్పులు వేయించావ్‌. ఇప్పుడేమో ఓట్ల కోసం చెప్పులు విడిచి ఆయన విగ్రహానికి ఒంగి ఒంగి దొంగ దండాలు పెడుతున్నావ్" కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడ్డారు. ఈ మేరకు సోమవారం ఆయన  చంద్రబాబుకు ఓ లేఖ రాశారు. 

హామీలను నెరవేర్చాలని అడిగితే.. కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆయన చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. ప్యాకేజీ వస్తుందని నాలుగేళ్లుగా డప్పు కొట్టి ఇప్పుడేమో హఠాత్తుగా ప్రత్యేక హోదా కావాల్సిందేనని చెప్పడం చంద్రబాబుకే చెల్లిందని ఆయన అన్నారు.

గతంలో బీజేపీతో కాపురం పెద్ద తప్పిదమన్న చంద్రబాబు మళ్లీ వాళ్ల కాళ్లు పట్టుకొని నాలుగేళ్ల పాటు కాపురం చేసి అందినకాడికి దోచుకున్నారని ఆరోపించారు. ఎప్పటికప్పుడు యూ టర్న్‌లు తీసుకుంటున్నారని, అలా అంటూ తనను కాపాడాలని ప్రజల్ని వేడుకోవడం కూడా చంద్రబాబుకే సొంతమని అన్నారు. 

రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఈమధ్య చంద్రబాబు ఎడాపెడా నీతులు వల్లె వేస్తున్నారని అంటూ మరి కాపు జాతిపై పెట్టిన తప్పుడు కేసుల మాట ఏమిటని అడిగారు. వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాక్కొని మంత్రి పదవులు కట్టబెట్టినప్పుడు రాజ్యాంగం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. 

loader